ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో 6వ యూనిట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల పర్యవేక్షణకు డెరైక్టర్లు రావడం, వెళ్లడం తప్ప అభివృద్ధిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీపీపీలో 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అంకురార్పణ జరిగింది. సుమారు రూ. 3 వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులను బీహెచ్‌ఈఎల్, టెప్రో కంపెనీలు దక్కించుకున్నాయి. బీహెచ్ ఈఎల్ కంపెనీ సుమారు రూ. 1455 కోట్లతో బాయిలర్, ఈఎస్‌పీ పనులు చేపట్టింది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అలాగే టెప్రో కంపెనీ సుమారు రూ. 1255 కోట్లతో దక్కించుకున్నపనులు కొన్ని మధ్యలో ఆగిపోగా మరికొన్ని అసలు ప్రారంభమే కాలేదు. వీటిలో చిమ్నీ, కూలింగ్ టవర్, టర్బైన్ పనులు మధ్యలో నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన ఇనుప కడ్డీలు తుప్పు పడుతున్నాయి. నాలుగు నెలల నుంచి ఈ కంపెనీ పనులు ఆగిపోయాయి. ఇక యాష్ ప్లాంట్, స్ట్రక్చరల్ స్క్రీన్, కోల్‌ప్లాంట్, ఆయిల్ పంప్‌హౌస్ పనులు ప్రారంభం కాలేదు. ప్రతి నెలా ఏపీ జెన్‌కో డెరైక్టర్లు రాధాకృష్ణ, కృష్ణమూర్తి, సివిల్ సీఈ రత్నబాబు పనుల పర్యవేక్షణకు వచ్చేవారు. అయినా ఈ పనుల్లో పురోగతి లేదు. జూలై నెల నుంచి డెరైక్టర్లు ఆర్టీపీపీకి రాకపోవడమే గాక కంపెనీల సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు.
ఇదిలా ఉండగా టెప్రో కంపెనీ జాడ ఆర్టీపీపీలో కనిపించడం లేదని కొందరు అధికారులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరవ యూనిట్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈనెల 12న మంగళవారం ఆర్టీపీపీకి ఎండీ విజయానంద్, ైడె రెక్టర్ రాధాకృష్ణ తదితరులు రానున్నారు. వీరు ఆరో యూనిట్ పనులపై దృష్టి సారిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఆరో యూనిట్ పనులపై జెన్‌కో బోర్డు దృష్టి సారించి ఉంటే ఫలితం ఉండేదనే అభిప్రాయం ఆర్టీపీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఆర్టీపీపీలో ముందుకు సాగని ఆరవ యూనిట్ పనులు
Published Mon, Nov 11 2013 2:31 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement