కశింకోట రైల్వే స్టేషన్‌లో రాయగడ పాసింజర్ రైలు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికు లు అవాక్కయ్యారు.
కశింకోట, న్యూస్‌లైన్ : కశింకోట రైల్వే స్టేషన్‌లో రాయగడ పాసింజర్ రైలు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికు లు అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని ఆందోళనకు దిగడంతో రైల్వే అధికారులు స్పం దించారు. మరో సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను ఆగకుండా వెళ్లిపోయిన పాసింజర్ రైలులోకి చేర్చారు. కలకలం రేపిన ఈ సంఘటన బుధవారం కశింకోటలో చోటు చేసుకుంది.
విజయవాడ నుంచి రాయగడ వెళ్లే పాసింజర్ రైలుకు కశింకోటలో హాల్టు ఉంది. ఉదయం 6.23 గంటలకు రావాల్సిన ఈ రైలు 7.15 గంటలకు వ చ్చి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఈ రైలు ఎక్కడానికి స్టేషన్‌లో వేచి ఉన్న వంద మంది పైగా ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయి స్టేషన్‌లో టిక్కెట్లు విక్రయించే హాల్టు ఏజెంటుకు ఫిర్యాదు చేయగా ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు. దీంతో వీరు స్టేషన్ వద్ద ఉన్న గేటుమేన్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు.
తమ గమ్యాలకు చేరడం ఆలస్యమవుతోందని, సకాలంలో విధులకు వెళ్లకపోతే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని గేటుమేన్ పక్కనున్న బయ్యవరం, అనకాపల్లి ైరె ల్వే స్టేషన్ మాస్టర్ల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించారు. అప్పటికే అనకాపల్లి ైరె ల్వే స్టేషన్ కూడా దాటిపోయిన పాసింజర్ రైలును తాడి స్టేషన్‌లో నిలిపివేశారు. వెనక వస్తున్న వాస్కోడిగామా-హౌరా అమరావతి సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ను కశింకోటలో ఆపి ఆ ప్రయాణికులను ఎక్కించారు.
వారిని తాడి స్టేషన్‌కు చేర్చి రాయగడ పాసింజర్ రైలులోకి తరలించినట్టు అనకాపల్లి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పార్థసారథి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అయితే కశింకోటలో దిగాల్సిన రాయగడ పాసింజర్ ప్రయాణికులు మాత్రం తాడి నుంచి వెనక్కి రావడానికి ఇబ్బందులు పడ్డారు.
సిగ్నల్స్ అవసరం
కశింకోట రైల్వేస్టేషన్ ఆరు దశాబ్దాల క్రితం ఏర్పడింది. సి-క్లాసు రైల్వేస్టేషన్‌గా క్లర్క్ ఇన్‌చార్జితో నడిచే స్టేషన్‌ను స్థానికుల నుంచి నిరశనతో ఆరేళ్ల క్రితం నిర్వహణ భారం పేరిట హాల్టు స్టేషన్‌గా మార్పు చేసి ప్రైవేటీకరించారు. హాల్టు స్టేషన్ ఏజెంటు ద్వారా టికెట్లు విక్రయిస్తున్నారు. ఇక్కడ క్రాసింగ్ రైల్వే లైన్లు లేనందు వల్ల రైల్వే లేన్లపై సిగ్నల్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆగాల్సిన రైల్వే స్టేషన్ల చార్టు ఉన్నా పొరపాటున ఒక్కోసారి రైలు డ్రైవర్లు ఈ స్టేషన్‌లో ఆపకుండా పోనిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా రైల్వే అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, 25 వేల జనాభా కలిగిన కశింకోట, పరిసర ప్రాంతాల వారికి ఉపయోగపడే రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.