సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో రెవె న్యూ డివిజన్ అధికారులుగా నియామకం పొందేందుకు పలువురు అధికారులు తెలుగుదేశం నేతల ఇళ్లవద్ద క్యూ కడుతున్నారు. తమ మాటను తు.చ తప్పక పాటిస్తూ జీ హుజూర్ అనే అధికారి కావాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఒకరిద్దరు అధికారులకు పోస్టింగ్ ఇప్పిస్తామని కబురు పంపారు.
ఈ విషయం తెలుసుకున్న మరికొందరు అధికారులు తాము వారికంటే బెటర్‌గా పనిచేస్తాం. మాకు అవకాశం కల్పించండి.. ఉత్తి పుణ్యానికే పోస్టింగ్ వద్దు.. నజరానా ముట్టజెపుతాం అంటూ ముందుకొచ్చినట్లు తెలిసింది. దీంతో అధికారపార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్ పంచుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు రెవె న్యూ మంత్రి వద్ద తుది జాబితాకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లలో పనిచేస్తున్న అధికారులు దీర్ఘకాలికంగా విధుల్లో ఉన్నారు. కడపలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు స్థానాల్లో పోస్టింగ్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నట్లు సమాచారం.
జమ్మలమడుగుకు వినాయకం ఖరారు
జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారిగా వినాయకం పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో పలుచోట్ల తహశీల్దారుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉపయోగపడినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడి సోదరుడి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఆయనను జమ్మలమడుగు ఆర్డీఓగా నియమించినట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ విధుల్లో ఉన్న రఘునాథరెడ్డి కోరుకున్న మేరకు శ్రీశైలం ఆర్డీఓగా పోస్టింగ్ ఖరారైనట్లు సమాచారం. కడపలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లవన్న స్థానంలో వరప్రసాద్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన జిల్లా వాసి కావడంతో ఉన్నత స్థాయి అనుమతి కోసం వేచి ఉన్నట్లు తెలిసింది. రాజంపేట ఆర్డీఓ విజయసునీత స్థానంలో శ్రీకాకుళంలో పనిచేస్తున్న శ్యాంప్రసాద్ పేరు ఖరారైనట్లు తెలిసింది. ఆ మేరకు అధికారికంగా వెలువడనున్న బదిలీ ఉత్తర్వుల జాబితాలో జిల్లాకు చెందిన ఈ ముగ్గురికి స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది.
గత అనుభవం... పరిచయంతోపాటు.....
‘తమ్ముడు..తమ్ముడే-పేకాట..పేకాటే’ అన్నట్లుగా ఎంత పరిచయం ఉన్నా అనుకున్న రీతిలో మచ్చిక చేసుకోకపోతే పోస్టింగ్ దక్కదని తెలుగుతమ్ముళ్లు నిరూపిస్తున్నారు. ఎక్కడన్నా మామ అనండి, వంగతోట కాదు అన్నట్లు డివిజన్ ప్రాధాన్యత బట్టి రేటు ఫిక్స్ చేసినట్లు పరిశీలకులు వివరిస్తున్నారు. స్వయంవరంలా తమ ఇళ్లవద్ద క్యూ కట్టిన వారిలో అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా నిలుస్తారని భావించిన వారినే టీడీపీ నేతలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆ మేరకు సొమ్ము చేసుకునే పనిలో అనుచరవర్గాలు నిమగ్నం కావడంతోనే ఈ తరహా వ్యవహారం నడిచినట్లు పలువురు భావిస్తున్నారు.
ఆర్డీఓ పోస్టింగ్ ప్లీజ్!
Published Sun, Sep 7 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement