నెల్లూరు(బారకాసు) నెల్లూరు : పొట్టేపాళెం ఇసుక రీచ్‌లో వేబిల్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇసుక రవాణాను నిలిపివేసి అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఇసుక రవాణాను పారదర్శకంగా నిర్వహించలనే తలంపుతో ప్రభుత్వం రీచ్‌లలో వేబిల్లును కంప్యూటర్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు పొట్టేపాళెం ఇసుక రీచ్‌లో కంప్యూటరైజ్డ్ పద్ధతిని నాలుగురోజుల క్రితం ఏర్పాటు చేసింది. అయితే కంప్యూటర్ ద్వారా వచ్చే వేబిల్లులు తప్పులు తడకగా వస్తున్నాయి.
ఈ వేబిల్లులు తీసుకున్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవిషయాన్ని అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో శుక్రవారం పొట్టెపాళెం రీచ్‌లో ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేసుకుని తీసుకెళ్లకుండా అక్కడే నిలిపి ఆందోళన చేపట్టారు. మొత్తం 147 ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేశారు. ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు వేబిల్లు కోసం కార్యాలయానికి రాగా సిబ్బంది వేబిల్లు ఇవ్వడంలో జాప్యం చేశారు. వచ్చిన బిల్లులో చిరునామా తప్పుగా ముద్రించి రావడంతో ఇలాగైతే వేబిల్లులు మాకొద్దంటూ వారంతా ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది ఫోన్ ద్వారా అధికారులకు జరిగిన విషయాన్ని వివరించారు.
కొంతసేపటికి డీఆర్‌డీఏ ఏపీడీ నాసరరెడ్డి, తహశీల్దార్ జనార్దన్‌రావు, ఆతర్వాత ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరెడ్డి ఇతర అధికారులు రీచ్‌కు చేరుకున్నారు. దీంతో కొంతసేపు అధికారులకు, ట్రాక్టర్ల యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి మధ్యాహ్నం రెండుగంటల సమయంలో లోటుపాటులను సోమవారంలోపు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని, ప్రస్తుతానికి వేబిల్లులను తీసుకెళ్లాలని అధికారులు హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.
తప్పులతో పోలీసులు ఆపుతున్నారు
-శ్రీహరి, ట్రాక్టర్‌యజమాని
ఇసుక రవాణా చేస్తున్న సమయంలో పోలీసులు ఆపి వేబిల్లు చూసి అడ్రస్సు తప్పు ఉండటంతో అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ వాహనాలను నిలిపివేసి భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. దీంతో చాలా నష్టపోతున్నాము. అధికారులు ఈవిషయంపై శ్రద్ధచూపి సరిచేయాలి.
ప్రభుత్వం ఆదేశాల మేరకే..
- నాసరరెడ్డి, ఏపీడీ, డీఆర్‌డీఏ
వేబిల్లుల పంపిణీ కంప్యూటర్ల ద్వారానే జరగాలనే ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే ఈప్రక్రియను చేపట్టాము. కంప్యూటర్లలో జరిగే తప్పులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే జరుగుతున్న లోటుపాట్లును సరిదిద్దుతాము.
పొట్టేపాళెం రీచ్‌లో రచ్చ
Published Sat, Apr 18 2015 3:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement