
ఇసుక రీచ్‌ల రాబడి స్థానిక సంస్థలకే కేటాయించాలి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పిడతాపోలూరు(ముత్తుకూరు): ఇసుక రీచ్‌ల ఆదాయంలో డ్వాక్రా మహిళా సంఘాలకు పోను మిగిలిన మొత్తం స్థానిక సంస్థలకు కేటాయించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జన్మభూమిలో భాగంగా శనివారం బ్రహ్మదేవి, పిడతాపోలూరులో జరిగిన గ్రామసభలో కాకాణి మాట్లాడారు. గతంలో ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు.
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఇసుక రీచ్‌ల రాబడి ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా స్థానిక సంస్థల బలోపేతానికి కేటాయించాలన్నారు. ఇప్పటికే గ్రావెల్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వం జమ చేసుకుంటోందన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర సీఎంలు ప్రకటించిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రలు గ్రామాల్లో అమలు కావాలన్నా, పారిశుధ్యం మెరుగుపడాలన్నా నిధులు, సిబ్బంది కొరత అవరోధంగా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ‘పొలం పిలుస్తోంది’ అంటూ ప్రచారం చేయడంతో ప్రయోజనం లేదన్నారు.
జిల్లాలో మొత్తం 2.16 లక్షల పింఛన్లలో 54,000 పింఛన్లకు కోత పెట్టారని విచారం వెలిబుచ్చారు. పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ గ్రామసభల్లో కాకాణి పేదలకు పింఛన్లను పంపిణీ చేశారు. తహశీల్దార్ చెన్నయ్య, ఎంపీడీఓ సుజాత, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, సర్పంచ్‌లు కట్టా సుబ్రహ్మణ్యం, తిరకాల ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు కె.రమేష్, దీనయ్య, కోటేశ్వరావు, వైఎస్సార్‌సీపీ మండల క న్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి పాల్గొన్నారు.