మత మార్పిడుల నిరోధక బిల్లుకు సిద్ధమా?
కాంగ్రెస్‌కు ఎం.వెంకయ్యనాయుడు సవాల్
పాకిస్తాన్ ఎంపీ అవైస్ ఖాన్ లెఘరీపై మండిపాటు
బెంగళూరులో ఐఎస్‌ఐఎస్‌కు
సహకరించే శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
తిరుపతి: మత మార్పిడుల నిరోధక బిల్లుకు అంగీకరిస్తే.. పార్లమెం టులో తాము చర్చకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ తండ్రి, కాంగ్రెస్‌కు మిత్రుడైన ములాయంసింగ్ యాదవ్ ఆగ్రాలో ఎలాంటి మత మార్పిడులు జరగలేదని కొట్టిపారేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మత మార్పిడుల నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే చట్టం చేయవచ్చని రాజ్యాంగ రచన పూర్తయిన వెంటనే బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్‌పటేల్ అప్పుడే చెప్పారన్నారు. మహాత్మాగాంధీ సైతం మత మార్పిడుల నిరోధక చట్టానికి అప్పట్లో సానుకూల ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. ఆగ్రాలో మతమార్పిడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. మత మార్పిడుల నిరోధక చట్టంపై చర్చిద్దామని తాము ప్రతిపాదిస్తే యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపరిచేందుకు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఇరు దేశాల పార్లమెంటేరియన్ల సదస్సులో పాకిస్తాన్ ఎంపీ అవైస్‌ఖాన్ లెఘరీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు మండిపడ్డారు.
ఉగ్రవాదులకు స్థావరాలను ఏర్పాటుచేసి.. నిధులు సమకూర్చి.. శిక్షణ ఇచ్చి భారతదేశంలో విధ్వంసానికి పురిగొల్పుతున్న పాకిస్థాన్ శాంతి ప్రవచనాలు వల్లెవేయడం వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్ర కు వెళ్లినట్టుందని ఎద్దేవా చేశారు. చరిత్ర పుటలను తిరగేస్తే భారతదేశం ఎన్నడూ దండయాత్ర చేసిన దాఖలాలు లేవని.. విదేశీయులే భారత్‌పై దండెత్తి వచ్చారని గుర్తు చేశారు. భారతదేశం ఎప్పుడూ ఇత ర దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుందని.. కయ్యాన్ని కోరుకోదని స్పష్టీకరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలను ఆపివేస్తే.. చర్చలకు తాము సిద్ధమని స్పష్టీకరించారు. ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్ మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం వల్లే సార్క్ సదస్సులో నరేంద్రమోదీ ఆయనతో అంటీఅంటనట్లు వ్యవహరించారని వివరించారు. ఇండో పాక్ పార్లమెంటేరియన్ల సదస్సులో కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ భారతదేశంపై, నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలకు ఆరోపణలకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఎస్‌ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరులోని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సహకరిస్తున్నారని బ్రిటన్‌కు చెందిన ఓ చానల్ బహిర్గతం చేయడాన్ని విలేకరులు వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘ఐఎస్‌ఐఎస్‌కు సహకరించే శక్తులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు.
ఈ అంశంపై అప్పుడే కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. ఐఎస్‌ఐఎస్‌కు సహకరిస్తున్న శక్తులను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం’’ అని స్పష్టీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ప్రతిపాదన ఎంత వరకూ వచ్చిందన్న విలేకరుల ప్రశ్నకు వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తో సంప్రదింపులు జరుపుతున్నాం.. అన్ని ప్రభుత్వా లు అంగీకారం తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపై నిర్ణయం తీసుకుం టాం’’ అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంట ఆపార్టీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు.