సాక్షి, గుంటూరు: అధికారం కోల్పోయి పదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడు అధికారం చేజిక్కడంతో హడావుడి చేస్తున్నారు. కనీసం ప్రమాణ స్వీకారమైనా చేయకముందే జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారుల బదిలీలపై దృష్టి పెట్టారు. ఈ నెల 8న పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేయాలి.. వారి స్థానాల్లో అనుకూలంగా ఉండే వారిని ఎలా నియమించుకోవాలి అనే అంశాలపై ప్రణాళిక రూపొందించుకున్నారు.
ఆలస్యమైతే ఏ నేత ఏ అధికారికి మాటిస్తారోననే భయంతో కొందరు ఇప్పటికే అధినేత వద్ద తాము రూపొందించిన జాబితాలు ఉంచినట్లు సమాచారం. ఒక నేత ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే గురిపెట్టినట్టు తెలుస్తోంది.జిల్లాలో ఓ మాజీ మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మరో వర్గం నేతలంతా ఏకమై ఉన్నతాధికారుల నియామకంలో తమ మాటే నెగ్గేలా ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేసినట్లు తెలుస్తోంది. సదరు ముఖ్యనేతకు మరో మాజీమంత్రికి విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ బదిలీలను ఆయన అడ్డుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, పదిమంది ఎమ్మెల్యేల చేత సంతకాలు కూడా సేకరించినట్లు చెబుతున్నారు.
జిల్లా ఉన్నతస్థాయి అధికారులు తాము తెచ్చుకున్న వారైతే జిల్లాలో తమ ఆధిపత్యం కొనసాగుతుందనేది ఆ ముఖ్యనేత ఆలోచన అయి ఉంటుందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. క్యాంపు కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేసి అక్కడి నుంచే పాలన కొనసాగించాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నాయకులు చెప్పిన అధికారులను నియమిస్తారా లేదా తన సొంత టీమ్‌లోని అధికారులు చెప్పిన వారిని నియమిస్తారా అనేది వేచి చూడాలి. సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తే రాష్ట్రస్థాయి అధికారులంతా ఇక్కడే మకాం వేసే అవకాశాలు ఉండటంతో వారికి దూరంగా వేరే జిల్లాల్లో పోస్టింగ్‌లు పొందితే బాగుంటుందనే అభిప్రాయంతో కొందరు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్ల తరువాత అధికారం పొందిన టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన కొందరు అధికారులు ప్రస్తుతం పోస్టింగ్‌లు తీసుకోకుండా లూప్‌లైన్‌లో పనిచేయడం మంచిదని భావిస్తున్నారు.
టీడీపీ నేతల చుట్టూ అధికారుల ప్రదక్షణలు..
జిల్లా స్థాయిలో అధికారుల తీరు ఇలా ఉంటే పట్టణ, మండల స్థాయిలో అధికారులు మాత్రం పోస్టింగ్‌ల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తమకు తెలిసిన టీడీపీ ద్వితీయశ్రేణి నేతల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సిఫార్సులు చేయించుకుంటూ ప్రాధాన్యం ఉన్న చోట పోస్టింగ్‌ల కోసం పరితపిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రి పదవుల కోసం హైదరాబాద్‌లోనే మకాం వేయడంతో ముందుగా ఫోన్‌లో ఎవరికీ మాటివ్వొద్దంటూ ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉండగా డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతోపాటు ఆర్డీవో, తహశీల్దార్, ఎంపీడీవో వంటి పోస్టులకు తీవ్ర పోటీ నెలకొని ఉండటంతో తాము మొదట్నుంచి టీడీపీకి అనుకూలంగా ఉండే వారమని చెప్పుకుంటూ అధికారులు తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.
బదిలీలకు రంగం సిద్ధం
Published Mon, Jun 2 2014 12:14 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement