రాష్ట్ర రాజధాని కోసం ప్రయివేటు వ్యక్తుల నుంచి వేలాది ఎకరాలను కొనుగోలు చేయడానికి తాము వ్యతిరేకమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు.
రాజమండ్రి : రాష్ట్ర రాజధాని కోసం ప్రయివేటు వ్యక్తుల నుంచి వేలాది ఎకరాలను కొనుగోలు చేయడానికి తాము వ్యతిరేకమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన రాజమండ్రిలో విలేకర్లతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యవస్థకు దోహదం చేసే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి 500 నుంచి వెయ్యి ఎకరాలలోపు సరిపోతుందని చెప్పారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుకు కేంద్రం రూ.1,900 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరాన్ని అడ్డుకుంటే భద్రాచలం డివిజన్ అంతా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలని కోరతామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వీర్రాజు పేర్కొన్నారు. రైతు రుణాలను మాఫీ చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.