జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలు... రాయలసీమకు చెందిన రియల్టర్లు.. ఆదిలాబాద్‌లో భూదందా.... ఈ మూడు ప్రధాన ఇతివృత్తాలుగా సినిమా స్టోరీని తలపించేలా ఓ రియల్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలు... రాయలసీమకు చెందిన రియల్టర్లు.. ఆదిలాబాద్‌లో భూదందా.... ఈ మూడు ప్రధాన ఇతివృత్తాలుగా సినిమా స్టోరీని తలపించేలా ఓ రియల్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సీఐడీ దర్యాప్తుతోపాటు పోలీసు ఉన్నతాధికారుల విచారణ వరకు వెళ్లిన ఈ వ్యవహారం తాజా గా బయటపడింది. పోలీసు విభాగం ఇప్పటికీ రహస్యంగా ఉంచిన ఈ ఘటనకు సంబంధించి ‘సాక్షి’కి విశ్వసనీయంగా అందిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలు ఏడాది కిందట ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో చెరో 50 ఎకరాల భూములు కొనుగోలు చేశారు.
రాయలసీమకు చెందిన ఓ బడా రియల్టర్ ఈ భూములను అమ్మకానికి పెట్టాడు. ఓ బ్రోకర్ చెప్పిన మాయమాటలు నమ్మి... ఇద్దరు సీఐలు లక్షలాది రూపాయలు కట్టబెట్టి బినామీ పేర్లతో ఈ భూములను సొంతం చేసుకున్నారు. కాగితాలపై విలువైన భూమిని తక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా చూపించిన దళారులు.... ఏకంగా సీఐలకు కుచ్చుటోపీ పెట్టారు. అక్కరకు రాని అటవీశాఖ భూములు, వాగులు, వంకలున్న ప్రాంతాన్ని అంటగట్టారు. తీరా... తాము మోసపోయిన విషయాన్ని సీఐలు గుర్తించేలోగా జారుకున్నారు. రాయలసీమకు చెందిన కె.విజయకుమార్‌రెడ్డి ఈ భూముల లావాదేవీల్లో సీఐకి, రియల్టర్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. ఎట్టకేలకు అతడి ఆచూకీ తెలుసుకున్న సీఐలు... తమ డబ్బులు తమకు ఇప్పించాలని పట్టుబట్టా రు. అప్పటికీ రియల్టర్ తమ దారికి రాకపోవటంతో బెదిరించారు. ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలని నానాతంటాలు పడ్డారు. ఒకదశలో తమ దగ్గర ఉండే తుపాకీ చూపిం చి భయపెట్టారని... డబ్బులిప్పించాలని బెదిరిస్తున్నారని విజయకుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న రాజకీయ అండదండలతో రియల్టర్ ఈ వ్యవహారాన్ని సీఐడీ విభాగానికి చేరవేశారు. రంగంలోకి దిగిన సీఐడీ విభాగం రహస్యంగా దర్యాప్తు చేపట్టింది.
ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ రవీందర్ హయాంలో విచారణ నివేదిక కోరినట్లు తెలిసింది. నిజానిజాలు బయటపడటంతో సీఐలపై చర్యలు తీసుకునేందుకు సీఐడీ పావులు కదిపింది. ఈలోగా సీఐలు తమవంతు ప్రయత్నాలు చేయటం... ఆ విభాగంలోని ఉన్నతాధికారులు బదిలీ కావడంతో ఈ స్టోరీకి బ్రేక్‌లు పడ్డాయి. సినీఫక్కీలో సాగిన ఈ చాటుమాటు వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తొక్కిపెట్టారా? శరవేగంగా ఆరా తీసిన సీఐడీ విభాగం ఈ ఫైలును పక్కన పడేసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.