ఒక రొమాంటిక్ క్రైం కథ | Real life romantic love crime story | Sakshi
Sakshi News home page

ఒక రొమాంటిక్ క్రైం కథ

Published Tue, Apr 14 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

Real life romantic love crime story

ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమను కాపాడుకోవడం కూడా యువతకు ఓ పరీక్షే. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనవడం.. అది ప్రేమో కాదో తెలుసుకోలేక ఆమెను ఎలాగైనా తన గుప్పిట్లో పెట్టుకోవాలనే తాపత్రంతో యువత పెడదోవ పడుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన ‘ఒక రొమాంటిక్ క్రైం కథ’ను పోలిన నిజ జీవిత కథ కర్నూలు నగరంలో వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకునేందుకు.. ఆమె తల్లిదండ్రుల వద్ద డబ్బున్న అబ్బాయిలా కనిపించేందుకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దొంగగా మారి కన్నవారి కలలను నిలువునా కూల్చేశాడు.
 
కర్నూలు: జల్సాలు చేయాలి... ప్రియురాలి వద్ద డబ్బున్న కుర్రాడిలా కనిపించాలనే కోరికతో చోరీలకు పాల్పడిన ఓ భావి ఇంజినీర్ కటకటాల పాలయ్యాడు. ఉన్నత చదువు చదివి తమకు ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను నీరుగార్చాడు. తుగ్గలి మండలం గుడిసెగుప్పరాళ్ల గ్రామానికి చెందిన చౌటప్పా చిరంజీవి అలియాస్ చిరంజీవి నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చదువుకునే సమయంలో డోన్ పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఆమెతో కలిసి జల్సాలు చేయడానికి డబ్బుల్లేక మొదట చిన్న చిన్న నేరాలు చేశాడు.

వారి స్నేహం అమ్మాయి యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒక సందర్భంలో గొడవ కూడా జరిగింది. ఎలాగైనా ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో డబ్బు, నగల కోసం దొంగగా మారి పోలీసుల వలలో చిక్కాడు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడి ప్రియురాలి కోసం బంగారు నగలను ఓ చోట పాతిపెట్టాడు. పోలీసుల విచారణలో విషయం వెలుగు చూసింది. కొత్తబస్టాండ్‌కు ఎదురుగా ఉన్న యుకాన్ షాపీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఎస్పీ ఆకే రవిక్రిష్ణ ఎదుట హాజరు పరిచారు.

ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెళ్లడించారు. నిందితుడి నుంచి రూ.11 లక్షలు విలువ చేసే 41 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కంప్యూటర్లు, రూ.31 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులను ఛేదించి, సొమ్ములు రికవరీ చేసినందుకు సీఐలు ములకన్న, ప్రవీణ్‌కుమార్, రంగనాయకులు, మధుసూధన్‌రావు, ఎస్‌ఐలు నాగలక్ష్మయ్య, తులసి, నాగప్రసాద్, ఏఎస్‌ఐ భాస్కర్, సిబ్బంది, రంగారావు, శివశంకర్, రమణ, శ్రీనివాసులు, రాజ్‌కుమార్, మద్దీశ్వర్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
 
దొంగల కోసం సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు..
దొంగతనాల నివారణ కోసం సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు ఎస్పీ వెళ్లడించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. వేసవి కాలమైనందున రాత్రి వేళల్లో ఇళ్లకు తాళాలు వేసి ఇళ్లపైన మిద్దెలపైన పడుకునేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో పెట్టుకోవాలన్నారు.
 
చిరంజీవి నేరాల చిట్టా...
* వెంకటరమణ కాలనీలోని రిటైర్డ్ ఉద్యోగి దేవదానం పవర్ సొల్యూషన్స్ అనే కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 7వ తేదిన కార్యాలయంలో చొరబడి కంప్యూటర్లను చోరీ చేశాడు.
* సీతారామనగర్‌లో నివాసముంటున్న పి.నాగరాజు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులను కలిసి వేరే ఊరికి వెళ్లాడు. గతేడాది జూన్ 13న రాత్రి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు.
* కస్తూరినగర్‌లో నివాసముంటున్న ఎన్.రామాంజనేయులు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. గతేడాది మార్చి 31వ తేదిన రాత్రి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలను మూట కట్టుకుని ఉడాయించాడు.
* పుష్పావతి నగర్‌లో నివాసముంటున్న అబ్రార్ ఫర్హానా ఇంట్లో గతేడాది నవంబర్ 20వ తేదిన సెల్‌ఫోన్, ట్యాబ్, బంగారు వస్తువులు చోరీ చేశాడు. ట్యాబ్‌ను వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. దాని ఐఎంఈ నంబర్ ఆధారంగానే పోలీసులు నిందితున్ని గుర్తించారు.
* గతేడాది జులై 1వ తేదిన ధనలక్ష్మినగర్‌లోని నాగభూషణరావు ఇంట్లో చొరబడి రూ.20 వేలు నగదు అపహరించాడు. ఈ ఏడాది జనవరి 4వ తేదిన కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న మద్దయ్య ఇంట్లో చొరబడి రూ.10 వేలు లూటీ చేశాడు.
* ఈ ఏడాది జనవరి 18న మహాలక్ష్మినగర్‌లో నివాసముంటున్న డాక్టర్ శారద ఇంట్లో చొరబడి రూ.48 వేలు నగదును మూట కట్టుకుని ఉడాయించాడు.
* ఈ ఏడాది మార్చి 12వ తేదిన ధనలక్ష్మినగర్‌లో నివాసముంటున్న పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆకుమల్లె శేషుఫణి ఇంట్లో 15 తులాల బంగారు నగలు చోరీ చేశాడు.
* ఈ ఏడాది జనవరి 8న బాలాజీ నగర్‌లో నివాసముంటన్న వెంకటేశ్వర్లు ఇంట్లో రాత్రి ఆరు తులాల బంగారు నగలు చోరీ చేశాడు.
* గతేడాది అక్టోబర్ 7వ తేదిన బాలాజీ నగర్‌లో నివాసముంటున్న కానిస్టేబుల్ మాబుసాహెబ్, శిరీషా దంపతులు ఇంట్లో చొరబడి 11 తులాల బంగారు నగలు అపహరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement