Romantic Crime Story
-
Mystery: హంతకుడు ఏమయ్యాడు?
ఇది 44 ఏళ్ల క్రితం, మార్చిలో ప్రారంభమై, అదే ఏడాది సెప్టెంబర్‌లో ముగిసిన రొమాంటిక్ క్రైమ్ కథ. 1980 సెప్టెంబర్ 18, సాయంత్రం 5 కావస్తోంది. అమెరికా మిసూరీలోని కాన్సాస్ సిటీలో ఓ బిల్డింగ్ ముందు ఓ కారు వేగంగా వచ్చి ఆగింది. కారులోంచి 34 ఏళ్ల తాన్యా కోప్రిక్ అనే డాక్టర్ కాలు బయటపెట్టింది. ఆమె పూర్తిగా దిగకముందే ఏకధాటిగా తుపాకి తూటాలు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. ఆ అలికిడికి బిల్డింగ్‌లోని కొందరు బయటికి పరుగు తీశారు. కారు దగ్గరకు వచ్చి చూస్తే, తాన్యా కారు ముందు సీటులో కుప్పకూలిపోయి ఉంది. కిల్లర్ అతి సమీపం నుంచి కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు డాక్టర్స్ తేల్చారు. తాన్యా చాలా అందగత్తె. ఆరేళ్ల క్రితమే యుగోస్లేవియా నుంచి అమెరికా వచ్చి, సొంతంగా ఆసుపత్రి పెట్టుకుని డాక్టర్‌గా సెటిల్ అయ్యింది. మరోవైపు పలు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా, కాలేజీల్లో ప్రొఫెసర్‌గా చాలా విధులు నిర్వహించేది. ఆమె హత్య జరిగిన భవంతిలోనే ఆమెకు సొంతగా అపార్ట్మెంట్ ఉంది. కారు, ఇల్లు, కావాల్సినంత సంపాదన, చక్కని జీవితం క్షణాల్లో ముగిసిపోయింది. తాన్యా మరణవార్త యుగోస్లేవియాలోని ఆమె పేరెంట్స్‌కు తెలియడంతో వాళ్లు కూడా కాన్సాస్ సిటీకి హుటాహుటిన చేరుకున్నారు.అయితే కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు చాలా కీలక సమాచారం అందింది. అసలు తాన్యాను హత్య చేసింది ఎవరో కాదు మాజీ ప్రియుడు రిచర్డ్ గెరార్డ్ బోక్లేజ్ అని తెలుసుకున్నారు. తాన్యాను రిచర్డ్ చంపడం, పారిపోవడం స్వయంగా చూశామని ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.యూనివర్సిటీ ఆఫ్ మిసూరీలో రిచర్డ్ ఫార్మసీ విద్యార్థిగా తాన్యాకు పరిచయం అయ్యాడు. అతడి కంటే తాన్యా పదకొండేళ్లు పెద్దది. వారి పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారడానికి నెలరోజులు కూడా పట్టలేదు. వారి బంధం ఎంత వేగంగా అల్లుకుందంటే 1980 మార్చిలో రిచర్డ్, హాస్టల్ ఖాళీ చేసి తాన్యా అపార్ట్మెంట్లోకి మారిపోయాడు. కాలక్రమేణా అతడికి చదువు మీద శ్రద్ధ తగ్గింది. తాన్యా చుట్టూనే ప్రదక్షిణలు చేసేవాడు. అతడి తీరును అతడి స్నేహితులు తీవ్రంగా విమర్శించినా పట్టించుకునేవాడు కాదు. కేవలం తాన్యా డబ్బు, ఆస్తి కోసమే ఆమెతో సాంగత్యం మొదలుపెట్టాడని చాలామంది గుసగుసలాడుకునేవారు. కానీ ఆ జంట ఎవరి మాటా వినలేదు. ఆరు నెలలు గడవకముందే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాన్యా ధ్యాసలో రిచర్డ్ తన కెరీర్‌ని పక్కన పెట్టేశాడు. చదువు తగ్గిపోయింది. మార్కులు తగ్గిపోయాయి. అతడి తీరు గమనిస్తూ వస్తున్న ప్రొఫెసర్స్ అతడిపై రెడ్ మార్క్ వేశారు. జూలై వచ్చేనాటికి రిచర్డ్ డాక్టర్ కావడానికి అనర్హుడని, ఇక యూనివర్సిటీకి రావాల్సిన పనిలేదని నోటీసులిచ్చారు. దాంతో రిచర్డ్ రగిలిపోయాడు. ‘నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే’ అంటూ తాన్యాను వేధించడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్స్‌తో, యూనివర్సిటీ నిర్వాహకులతో గొడవలకు దిగడం ప్రారంభించాడు. అడ్మిష¯Œ ్స డిపార్ట్మెంట్లో తన తరపున మాట్లాడి, తిరిగి తనకు అర్హత పత్రాన్ని ఇప్పించాలని ప్రతిరోజూ తాన్యాతో గొడవకు దిగేవాడు. అతనితో పడలేక సెప్టెంబర్ 2న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది తాన్యా. అపార్ట్మెంట్లోంచి అతణ్ణి బయటికి పంపించేసింది. దాంతో అతడు మరింత ఉన్మాదిగా మారిపోయాడు.రెండు వారాల తర్వాత తన కేసును పునఃపరిశీలించాలని వేడుకుంటూ యూనివర్సిటీ అడ్మిషన్ల కార్యాలయంలోని అధికారులకు లేఖ రాశాడు రిచర్డ్. చివరకు సెప్టెంబర్ 18న మధ్యాహ్నం మూడుగంటలకు పరిశీలనలో భాగంగా రిచర్డ్‌ను విచారణకు ఆహ్వానించారు ప్రొఫెసర్స్. అయితే అక్కడ కూడా రిచర్డ్ తీరు నచ్చక అతడు తిరిగి జాయిన్ కావడానికి వీల్లేదంటూ వారంతా తీర్మానించారు. దాంతో అదే రోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న తాన్యాను రిచర్డ్ కాల్చి చంపేశాడు. అయితే ఆ రోజు విచారణకు రిచర్డ్ ఒక కవర్ తెచ్చాడు. తాన్యా హత్య తర్వాత ఆ కవర్‌ను చూసిన చాలామంది ప్రొఫెసర్స్.. అందులోనే తుపాకి ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు కొన్ని వారాల ముందే ఆ పిస్టల్ని కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన రోజు కొంత దూరం వరకూ రిచర్డ్ పరుగుతీస్తూ వెళ్లాడని డాగ్స్ స్క్వాడ్ గుర్తించింది. బహుశా అతడికి ఎవరైనా లిఫ్ట్ ఇచ్చి ఉంటారని, అందుకే తప్పించుకోగలిగాడని డిటెక్టివ్స్ ఊహించారు. హత్య జరిగిన వారంలోనే రిచర్డ్ నుంచి తాన్యా తల్లిదండ్రులకు ఓ లేఖ వచ్చింది. దానిలో ‘తాన్యాకు నేను మరణ శిక్ష విధించాను. ఆమెకు తగిన శిక్షే వేశాను’ అని రాశాడు. ఆ పోస్ట్‌కార్డు మీద 2 రోజుల ముందు తేదీ ఉంది. ప్రస్తుతం రిచర్డ్‌కి 67 ఏళ్లు దాటుంటాయి. అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అతని పేరు చేరింది. ఏళ్లు గడిచే కొద్దీ రిచర్డ్ ఎలా ఉండి ఉంటాడోనని పోలీసులు ఎన్నో ఊహాచిత్రాలు గీయిస్తున్నారు. అయినా అతను మాత్రం ఇప్పటికీ దొరకలేదు. దాంతో ఈ కేసు అపరిష్కృతంగానే మిగిలిపోయింది. రిచర్డ్ ఏమయ్యాడనేది నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది.∙సంహిత నిమ్మన -
ఒక రొమాంటిక్ క్రైం కథ
ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమను కాపాడుకోవడం కూడా యువతకు ఓ పరీక్షే. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనవడం.. అది ప్రేమో కాదో తెలుసుకోలేక ఆమెను ఎలాగైనా తన గుప్పిట్లో పెట్టుకోవాలనే తాపత్రంతో యువత పెడదోవ పడుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన ‘ఒక రొమాంటిక్ క్రైం కథ’ను పోలిన నిజ జీవిత కథ కర్నూలు నగరంలో వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకునేందుకు.. ఆమె తల్లిదండ్రుల వద్ద డబ్బున్న అబ్బాయిలా కనిపించేందుకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దొంగగా మారి కన్నవారి కలలను నిలువునా కూల్చేశాడు. కర్నూలు: జల్సాలు చేయాలి... ప్రియురాలి వద్ద డబ్బున్న కుర్రాడిలా కనిపించాలనే కోరికతో చోరీలకు పాల్పడిన ఓ భావి ఇంజినీర్ కటకటాల పాలయ్యాడు. ఉన్నత చదువు చదివి తమకు ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను నీరుగార్చాడు. తుగ్గలి మండలం గుడిసెగుప్పరాళ్ల గ్రామానికి చెందిన చౌటప్పా చిరంజీవి అలియాస్ చిరంజీవి నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చదువుకునే సమయంలో డోన్ పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఆమెతో కలిసి జల్సాలు చేయడానికి డబ్బుల్లేక మొదట చిన్న చిన్న నేరాలు చేశాడు. వారి స్నేహం అమ్మాయి యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒక సందర్భంలో గొడవ కూడా జరిగింది. ఎలాగైనా ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో డబ్బు, నగల కోసం దొంగగా మారి పోలీసుల వలలో చిక్కాడు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడి ప్రియురాలి కోసం బంగారు నగలను ఓ చోట పాతిపెట్టాడు. పోలీసుల విచారణలో విషయం వెలుగు చూసింది. కొత్తబస్టాండ్‌కు ఎదురుగా ఉన్న యుకాన్ షాపీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఎస్పీ ఆకే రవిక్రిష్ణ ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెళ్లడించారు. నిందితుడి నుంచి రూ.11 లక్షలు విలువ చేసే 41 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కంప్యూటర్లు, రూ.31 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులను ఛేదించి, సొమ్ములు రికవరీ చేసినందుకు సీఐలు ములకన్న, ప్రవీణ్‌కుమార్, రంగనాయకులు, మధుసూధన్‌రావు, ఎస్ఐలు నాగలక్ష్మయ్య, తులసి, నాగప్రసాద్, ఏఎస్ఐ భాస్కర్, సిబ్బంది, రంగారావు, శివశంకర్, రమణ, శ్రీనివాసులు, రాజ్‌కుమార్, మద్దీశ్వర్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. దొంగల కోసం సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు.. దొంగతనాల నివారణ కోసం సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు ఎస్పీ వెళ్లడించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. వేసవి కాలమైనందున రాత్రి వేళల్లో ఇళ్లకు తాళాలు వేసి ఇళ్లపైన మిద్దెలపైన పడుకునేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. చిరంజీవి నేరాల చిట్టా... * వెంకటరమణ కాలనీలోని రిటైర్డ్ ఉద్యోగి దేవదానం పవర్ సొల్యూషన్స్ అనే కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 7వ తేదిన కార్యాలయంలో చొరబడి కంప్యూటర్లను చోరీ చేశాడు. * సీతారామనగర్లో నివాసముంటున్న పి.నాగరాజు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులను కలిసి వేరే ఊరికి వెళ్లాడు. గతేడాది జూన్ 13న రాత్రి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. * కస్తూరినగర్‌లో నివాసముంటున్న ఎన్.రామాంజనేయులు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. గతేడాది మార్చి 31వ తేదిన రాత్రి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలను మూట కట్టుకుని ఉడాయించాడు. * పుష్పావతి నగర్లో నివాసముంటున్న అబ్రార్ ఫర్హానా ఇంట్లో గతేడాది నవంబర్ 20వ తేదిన సెల్‌ఫోన్, ట్యాబ్, బంగారు వస్తువులు చోరీ చేశాడు. ట్యాబ్‌ను వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. దాని ఐఎంఈ నంబర్ ఆధారంగానే పోలీసులు నిందితున్ని గుర్తించారు. * గతేడాది జులై 1వ తేదిన ధనలక్ష్మినగర్‌లోని నాగభూషణరావు ఇంట్లో చొరబడి రూ.20 వేలు నగదు అపహరించాడు. ఈ ఏడాది జనవరి 4వ తేదిన కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న మద్దయ్య ఇంట్లో చొరబడి రూ.10 వేలు లూటీ చేశాడు. * ఈ ఏడాది జనవరి 18న మహాలక్ష్మినగర్‌లో నివాసముంటున్న డాక్టర్ శారద ఇంట్లో చొరబడి రూ.48 వేలు నగదును మూట కట్టుకుని ఉడాయించాడు. * ఈ ఏడాది మార్చి 12వ తేదిన ధనలక్ష్మినగర్‌లో నివాసముంటున్న పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆకుమల్లె శేషుఫణి ఇంట్లో 15 తులాల బంగారు నగలు చోరీ చేశాడు. * ఈ ఏడాది జనవరి 8న బాలాజీ నగర్లో నివాసముంటన్న వెంకటేశ్వర్లు ఇంట్లో రాత్రి ఆరు తులాల బంగారు నగలు చోరీ చేశాడు. * గతేడాది అక్టోబర్ 7వ తేదిన బాలాజీ నగర్లో నివాసముంటున్న కానిస్టేబుల్ మాబుసాహెబ్, శిరీషా దంపతులు ఇంట్లో చొరబడి 11 తులాల బంగారు నగలు అపహరించాడు.