ప్రేమ ముసుగులో కామవాంఛ బుసకొడుతోంది. ఫేస్‌బుక్, వాట్సప్, వీడియోకాలింగ్, యూట్యూబ్ మునివేళ్లతో ఆపరేట్‌చేసేస్తే అదేదో పిల్లల మేథస్సుగానే తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లలు ఐదో తరగతి నుంచే స్మార్ట్‌ఫోన్ వినియోగంతో వ్యసన పరులుగా మారుతున్నారు. నిమిషం సెల్‌ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఫాలోవర్స్‌ను పెంచుకోవడం, కామెంట్లు, లైక్‌లను లెక్కపెడుతున్నారు. విచక్షణ కోల్పోయి ఫేస్‌బుక్‌లో దాపరికం లేకుండా ఫొటోలు పెట్టడం ప్రస్తుతం యువతకు క్రేజ్‌గా మారింది.
సాక్షి, అచ్యుతాపురం(యలమంచిలి)/అల్లిపురం (విశాఖ దక్షిణ): ఒకప్పడు ప్రేమికులు కళ్లతో ఆరాధించేవారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక ఏకాంత ప్రదేశంలో కలవడానికి మరికొంతకాలం పట్టేది. ఇద్దరి మనుస్సులో చెరగని ముద్రగా ప్రేమ నిలిచిపోయేది. ప్రేమను మనసు కోరుకునేది తప్పా శరీరం కోరుకునేదికాదు. ప్రస్తుతం ప్రేమ మాటు కామవాంఛ కాలనాగులా బుసకొడుతోంది. ఎవరిని నమ్మాలో అర్థం కావడంలేదు. అనకాపల్లిలో ప్రియురాలిపై కత్తితో దాడిచేసిన ఘటన, అరుకులో పుష్పను హత్యచేసిన సంఘటన, విశాఖలోని జెండాచెట్టువీధిలో పదేళ్ల బాలికపై లైంగికదాడి కలవరపెడుతున్నాయి.
బాధ్యత నేర్పని తల్లిదండ్రులు..
పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తిండి,బట్ట, విద్య, వైద్యం అందిస్తే సరిపోయేది. ఇప్పుడు మనిషిని చేయడం ప్రధానమైంది. మంచి బుద్ధి నేర్పడం ప్రత్యేక అంశంగా మారిపోయింది. తల్లిదండ్రులను గౌరవించడం, ఆడపిల్లలను అక్కచెల్లెళ్లుగా భావించి ఆదరించడం, పెద్దలను పూజించడం.. గురువులు చెప్పిన మాట వినడం వంటి కోర్సులు ఎక్కడైనా ఉంటే బాగున్ను అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లలతో మాట్లాడే తీరిక తల్లిదండ్రులకు లేకుండాపోయింది. ఇద్దరు ఉద్యోగం, ఉపాధి చేస్తేగాని ఇల్లు గడవడం లేదు. పిల్లలు సుఖంగా ఉండడంకోసం తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తున్నారు. అలసిపోయి వచ్చిన తల్లిదండ్రులు గంటలపాటు ఫోన్‌లో చాటింగ్‌చేసినా, మాట్లాడినా పిల్లల్ని వారించడంలేదు. పిల్లలు పీకలవరకూ ప్రేమలో మునిగిపోయిన తరువాత తేరుకుంటున్నారు. తల్లిదండ్రులు నిరంతరం పిల్లలతో మాట్లాడుతూ బాధ్యతలు అప్పగించి ఉంటే నడవడిక సక్రమంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వారే తీర్చిదిద్దాలి...
ఐదేళ్లనుంచి 25 ఏళ్ల వరకూ పిల్లలు ఎక్కువ సమయం విద్యతోనే గుడుపుతారు. పిల్లల మనసులో ఏముందో గురువులకే తెలుస్తుంది. చెప్పిన పాఠ్యాంశం ఎంతమేరకు వంటపడుతుందోనని నిత్యం పరీక్షించే ఉపాధ్యాయులకు పిల్లల గుండెచప్పుడు వినిపిస్తుంది. పిల్లల ఏకాగ్రత, ఆసక్తి, ఆలోచన, నడత, నడవడిక అర్థమవుతుంది. పిల్లల కళ్లలోకి చూసి పాఠాలు చెబితే విద్యార్థి మానసిక స్థితి అర్థమవుతుంది. గురువు చూపు విద్యార్థిపై ఉంటే వచ్చే చెడు ఆలోచనలు దూరమవుతాయి. గురువు తలచుకుంటే కంటిచూపుతో రుగ్మతలను చంపేయగలరు. నాలుగు దశాబ్దాల క్రితం విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఆ అనుబంధం ఉండేది. ఆడపిల్లలు మహిళా ఉపాధ్యాయుల చెంగుపట్టుకొని తిరిగేవారు. తల్లితో చెప్పుకోలేని సమస్యలను టీచర్‌కు చెప్పేవారు. తరగతిలో ప్రతి విద్యార్థి నడవడికపై ఉపాధ్యాయుడికి అవగాహన ఉండేది. లాస్ట్‌బెంచ్ పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టేవారు. గాడితప్పుతున్న పిల్లల విషయమై తల్లిదండ్రుల వద్ద పంచాయతీ పెట్టేవారు. విద్యా విధానంలోనే మార్పువచ్చింది. పిల్లల్ని మందలిద్దామంటే తల్లిదండ్రులు రాద్ధాంతం చేస్తారని ఉపాధ్యాయులు పట్టించుకోవడంలేదు. మందలిస్తే అలిగి వెళ్లిపోతాడేమోనని తల్లిదండ్రులు మౌనంగా ఉంటున్నారు.. దీంతో పిల్లల ఇష్టారాజ్యంగా విద్యసాగుతోంది.
నీడను నమ్మడానికి లేదు..
మహిళ ప్రాణానికి ఏ రూపంలో ప్రమాదం వస్తుందో చెప్పలేకపోతున్నాం. ఫేస్‌బుక్ పరిచయమైన వాడు నమ్మకంగా రమ్మని గొంతుకోయవచ్చు. అనుమానంతో స్వయాన భర్త హతమార్చవచ్చు. పేమించలేదని ఒకడు, కోరిక తీర్చలేదని ఇంకొకడు, ఒంటరిగా దొరికితే గ్యాంగ్ రేప్, నగలకోసం చైన్‌స్నాచర్, మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం, కార్లతో గుద్దిచంపడం పురుష పైశాచికం పరాకాష్టకు చేరుకుంది. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగిననాడు స్వాతంత్య్రం వచ్చినట్టని మహాత్మా గాంధీమాట. ప్రస్తుతం పట్టపగలు మహిళ ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వచ్చేవరకూ తల్లిదండ్రులు భగవంతుడిపై భారం వేసి ఎదురుచూస్తున్నారు. రాక్షసుడు ఎక్కడినుంచో రానక్కల్లేదు. ఎదురింటివాడు, పక్కింటివాడు, కుటుంబసభ్యులు, రోజు మార్కెట్‌కు వెళ్తేంటే పలకరించేవాడు, కాలేజీలో పక్కబెంచీలో కూర్చునేవాడు, ఆఫీసులో తనతోపాటు పనిచేసేవాడు వీరే కాలనాగుల్లా కాటేస్తున్నారు. మృగాళ్లుగా మారుతున్నారు. నీడను కూడా నమ్మడానికి లేకుండా సంఘటనలు గుణపాఠాలునేర్పుతున్నాయి.
బాని‘సెల్’గా మారుతున్నారు..
సోషల్‌మీడియా, సెల్‌ఫోన్ వినియోగం పెరగడంతో మగపిల్లల మానసిక స్థితి మారుతోంది. ఏకాగ్రతను, నిగ్రహాన్ని కోల్పోతున్నారు. తగరతి గదిలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతుంటారు. టెక్నాలజీని సద్వినియోగపరుచుకుని బాగుపడుతున్న పిల్లలు ఉన్నారు. కొందరు కేవలం వినోదం కోసమే సెల్‌ఫోన్‌ను వాడుతున్నారు. వారు సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు. చదివేవాడు కామ్‌గా ఉంటాడు. ఆకతాయిగా తిరిగేవాడు చలాకీగా ఉంటాడు. వాడి చేష్టలకు కొందరు ఆడపిల్లలు పడిపోతున్నారు. గతంలో వందకు ఒకరిద్దరుండేవారు. వారిని ఉపాధ్యాయులు గుర్తించి మందలించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఎక్కువయ్యింది. తరుచూ కౌన్సెలింగ్ ఇచ్చిన ఆ క్షణంలోనే పనిచేస్తుంది. కాలేజీ నుంచిబయటకు వెళ్లగానే ప్రవృత్తి బయటకు వస్తుంది. ఆడపిల్లలే తమను తాము రక్షించుకోవాలి.
–ఎం.స్వాతి, ఉమెన్ అడ్వైజర్
పిల్లలతో మాట్లాడే తీరిక లేకే...
తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడే తీరికి ఉండటంలేదు. ఇద్దరు ఉద్యోగ,ఉపాధికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటివద్ద ఎవరూ ఉండరు. వారి పని ఒత్తిడిలో పడి పిల్లల మనసు తెలుసుకునే వీలు ఉండటంలేదు. తల్లిదండ్రులు గొడవలు పడినప్పుడు పిల్లల మానసిక రుగ్మతలకు గురవుతారు. మానసిక ఒత్తిడి నేరప్రవృత్తిని అలవర్చుకుంటుంది. ఇటీవల కొన్ని సినిమాలు, సోషల్‌మీడియా వీడియోలు, రకరకాల నేరాలకు పాల్పడే విధానాన్ని ప్రేరేపించేలా ఉంటున్నాయి. మానసిక రుగ్మతగల వ్యక్తులు ఆ వీడియోలను చూస్తే నేరాలకు పాల్పడే పరిస్థితి ఉంది.
–ఎస్.కె.సహిదా, ఇంజినీర్
చట్టాలపై అవగాహన లేకే...
నేడు మహిళలపై లైంగిక దాడులతో పాటు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మన దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయి. ఎటొచ్చి వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. తమపై జరుగుతున్న లైంగిక దాడులు, గృహహింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాడకుండా అడుగడుగునా అనేక సామాజిక కట్టుబాట్లు అడ్డుపడుతున్నాయి. ఈ బంధనాలను చేదించుకొని అణచివేతకు వ్యతిరేకంగా చేపట్టే పోరాటానికి అండగా ఉండడానికి, రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగాలి.
–పొలమరశెట్టి భవాణి, సీనియర్ న్యాయవాది
పురుషాధిక్యతను తరిమేయాలి..
పురుషాధిక్యతను ఇంటినుంచే తరిమేయాలి. ఎవరూ నేర ప్రవృత్తితో పుట్టరు. పెంపకం, పరిసరాలు, సామాజిక కట్టుబాట్లు నేరగాళ్లను తయారు చేస్తున్నాయి. పెంపకంలోనే ఆడపిల్లకు అణిచివేత మొదలవుతుంది. మగపిల్లలకు అడిగినవన్నీ కొనిస్తారు. ఇంటిపనులన్నీ ఆడపిల్లకే అప్పగిస్తారు. బయట బలాదూరుగా తిరగడానికి మగపిల్లలకు లైసెన్స్ ఇచ్చి ఆడపిల్లల్ని గడప దాటనీయరు. అదే మగపిల్లలు నేరాలుచేస్తే తల్లిదండ్రులు ముఖందాచుకొని కుమిలికుమిలి ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్టిసారిస్తే పిల్లల్లో మానవత్వాన్ని పెంపొందించే వీలుంటుంది. విద్యలో సగం సమయం వ్యక్తిత్వాన్ని పెంపొందించే కృత్యాలు, పాఠ్యాంశాలు సాంస్కృతిక కళలు, సంగీతం ఆటలు, పాటలు ఉండాలి. నిరంతం తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మనసు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
–మాధవి, స్కిల్ ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment