అంతర్‌జిల్లా గజదొంగల పట్టివేత
రూ.33 లక్షల సొత్తు స్వాధీనం
విజయవాడ సిటీ : అంతర్ జిల్లా దొంగలు ఇద్దరు పోలీసుల చేతికి చిక్కారు. పగలు రోడ్లపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి వేళ తాళం పగులగొట్టి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఏడాది కాలంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కమిషనరేట్‌లో 23 చోరీలకు పాల్పడిన రాజమండ్రికి చెందిన అంబటి మధు, కాకినాడకు చెందిన ఎస్.కె.అజీజ్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.33 లక్షల విలువైన 1140 గ్రాముల బంగారు నగలు, 4 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి భద్రతల డీసీపీ ఎల్.కాళిదాస్ వివరించారు.
నేర చరిత్ర
ప్రధాన నిందితుడు మధు 9వ తరగతి చదివేటప్పుడే చోరీల బాట పట్టాడు. పలుమార్లు జైలు జీవితం గడిపిన మధు 2011లో విశాఖ జైలు నుంచి బయటకు వచ్చి భీమడోలు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, రాజమండ్రి, గుడివాడలో చోరీలకు పాల్పడ్డాడు. రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో జైల్లో కాకినాడకు చెందిన పాత నేరస్తుడు అజీజ్ పరిచయమయ్యాడు. 2015లో బయటకు వచ్చిన వీరిద్దరూ మరో ఇద్దరిని కలుపుకొని చోరీలు చేస్తున్నారు.
ఇవీ నేరాలు
విజయవాడ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం, పటమట, అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 9 చోరీలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా బెండపూడి, గోపాలపురం, పసలపూడి, రాయవరం, తొండంగి, వేములవాడ, అనపర్తి, కడియంలలో 10 ఇంటి దొంగతనాలు చేశారు. తాడేపల్లిగూడెం, వేల్పూరు, ఇరగవరం, తణుకు ప్రాంతాల్లో నాలుగు చోరీలు చేసి 33 లక్షల సొత్తును కొల్లగొట్టారు.
ఇలా చిక్కారు
నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే చోరీ సొత్తు విక్రయించేందుకు నగరానికి చేరుకొని బీఆర్టీఎస్ రోడ్డులోని మధురానగర్ వంతెన వద్ద ఉన్నారు. వీరిని గుర్తించిన సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకుని సంబంధిత పోలీసులకు అప్పగించనున్నట్టు డీసీపీ తెలిపారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు, ఏసీపీలు వి.ఎస్.ఎన్.వర్మ, పి.సుందరరాజు, పి.పోతురాజు, సీసీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పగలు రెక్కీ..రాత్రి చోరీలు
Published Sat, Mar 12 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement