పునాదుల్లోనే పులకుర్తి
అధికారంలోకి వచ్చిన వెంటనే పులకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తి చేయిస్తాం. కరువును పారదోలి రైతులను ఆదుకుంటాం.
- పాదయాత్ర సమయంలో గూడూరు, సి.బెళగల్ మండల కేంద్రాల్లో రైతులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు.
కర్నూలు రూరల్: పాలకుల నిర్లక్ష్యంతో కోడుమూరు నియోజకవర్గంలో పులకుర్తి ఎత్తిపోతల పథకం పనులు మందుకు సాగడం లేదు. శంకుస్థాపన చేసి ఏడాది దాటిపోయిన ఈ పథకం పునాదులకే పరిమిత మయింది. తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని టెయిల్‌పాండ్ కాలువ అయిన కర్నూలు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న 23 వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. ఈ భూములకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత నేత శిఖామణి 2006 మార్చిలో జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు.
వైఎస్సార్ సానుకూలంగా స్పందించడంతో పులకుర్తి ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు 2006 మే నెల 11వ తేదీన నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సర్వే ఉత్తర్వులు వచ్చాయి. అయితే శిఖామణి మరణంతో ఆ పథకం పనులు సాగలేదు. గత ఏడాది జూన్ నెలలో హడావుడిగా కోడుమూరులో ఉన్న దిగువ కాలువ సబ్‌డివిజన్ ఆఫీస్ అవరణంలోనే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పంపింగ్ స్టేషన్ పనులు పునాదులతో నిలిచిపోయాయి. శంకుస్థాపనకు ముందే భూసేకరణ చేయాల్సి ఉన్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో పథకం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతున్నాయి. ఈ పథకం నుంచి సి.బెళగల్ చెరువుకు తుంగభద్ర జలాలు అందనున్నాయి. ఈ చెరువు కింద ఉన్న సుమారు 1250 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ పథకం ద్వారా గుండ్రేవుల దగ్గర వాటర్ పంపింగ్ స్టేషన్ నుంచి పులకుర్తి సమీపంలోని రిజర్వాయర్‌కి నీటిని సరఫరా చేయాల్సింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..పులకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
భూ సేకరణే అసలు సమస్య
పులకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2013 జూన్ నెలలో శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్, పైపు లైన్‌ల కోసం అవసరమైన 122ఎకరాల భూసేకరణ జరుగాల్సింది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. భూసేకరణకు ప్రభుత్వ నిబంధనల మార్పు వల్లే అనుమతులు రావడం లేదు.
- ఆర్.నాగేశ్వర్‌రావు,
నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్