కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: గాజులదిన్నె ప్రాజెక్టు ఆధునికీకరణ అస్తవ్యస్తంగా మారింది. కోట్లు ఖర్చుచేసినా ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు పెరగడం లేదు. హంద్రీ నదిపై 1977 సంవత్సరంలో ఈ జలాశయాన్ని నిర్మించారు. 5.25 టీఎంసీల సామర్థ్యంతో 32,500 ఎకరాలకు రబీలో సాగునీరు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. అయితే ప్రాజెక్టు కరకట్టలు బలహీనంగా ఉండడం, గేట్లు శిథిలావస్థకు చేరి, పంట కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
దీంతో ఆయకట్టు ఏటేటా తగ్గుతూ వస్తోంది. సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టు.. తాగునీటి జలాశయంగా మారింది. ప్రాజెక్టు పటిష్టతకు చర్యలు తీసుకోకపోతే మనుగడ కష్టమని 1996 సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్, ఈఎన్‌సీల బృందం ఇచ్చిన నివేదిక మేరకు 2009 సంవత్సరంలో ప్రాజెక్టును ఆధునీకరించడం కోసం జపాన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెన్సీ(జేఐఏసీ) సహాయంతో 43 కోట్లతో పనులు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. 2011 సంవత్సరంలో హైదరాబాద్‌కు చెందిన హార్విన్ కన్‌స్ట్రక్షన్ గ్రూపు ఒక శాతం తక్కువతో టెండర్ వేసి అగ్రిమెంట్ చేసుకుంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఏజెన్సీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. రాజకీయ నాయకుల వాటాలు.. అధికారుల పర్సంటేజీల వల్ల పనులు అడ్డగోలుగా చేశారు. వీటిని తనిఖీ చేసేందుకు ఆయకట్టు అభివృద్ధి శాఖ స్పెషల్ కమీషనర్ వెంకట్రామయ్య, జైకా ప్రతినిధులు శుక్రవారం గాజులదిన్నెకు వస్తున్నారు.
ఆధునికీకరణ ఇలా.. జలాశయానికి ఉన్న ఆరు స్లూయిజ్‌ల గోడలు బలహీన పడ్డాయి. వీటికి మరమ్మతులు చేసి, వరద ఉదృతికి తట్టుకునేలా అదనంగా రెండు స్లూయిజ్‌లను నిర్మించాల్సి ఉంది. జలాశయం కుడికాలువ 36 కి.మీ., ఎడమ కాలువ 22 కి.మీ., వరకు లైనింగ్ పనులు చేయాలి. కుడి కాలువ 24 కి.మీ, ఎడమ కాలువ 16 కి.మీ వరకే లైనింగ్ చేసి, డిస్రీబ్యూటరీ కాలువలు చేయకపోవడంతో చేసిన పనులు ప్రయెజనకరంగా లేవని ఆయకట్టుదారులు వాపోతున్నారు. ఈ పనులు తుంగభద్ర దిగువ కాలువ ఈఈ పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. అయితే దిగువ కాలువకి దాదాపు సంవత్సరంన్నర నుంచి రెగ్యులర్ ఈఈ లేకపోవడం ఇన్‌చార్జిగా చిన్న నీటిపారుదల శాఖ కర్నూలు సర్కిల్ ఈఈ శ్రీనివాసులు పని చేస్తున్నారు.
నాసిరకంగా జరిగిన పనుల్లో కొన్ని... కుడి కాలువ 2 నుంచి 12 కిలో మీటర్ల వరకు చేసిన పనుల్లో నాణ్యత డొల్లతనం కనిపిస్తోంది. 7.9 కి.మీ., వద్ద కాలువ లైనింగ్‌లో నాణ్యత లేకపోవడంతో చీలికలు ఏర్పడ్డాయి. 8.90 కి.మీ., వద్ద కంకర రాళ్లు బయటికే కనిపిస్తున్నాయి. 4.15 కిలో మీటర్ల వద్ద చేపట్టిన తూము పనులు అసంపూర్తిగానే వదిలేశారు 5.9, 7.10 కి.మీ., వద్ద ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు కాల్వల్లో ఎక్కడ చూసిన చీలికలే అగుపిస్తాయి. ఇవి పైకి కనిపించకుండా మట్టితోనే కప్పివేశారు. కెనాల్ గట్ల పటిష్టతకు గ్రావెల్ ఫెన్సింగ్ చేయాల్సి ఉన్నా సదరు కాంట్రాక్టర్ సమీపంలో ఉన్న రైతుల పొలాల గట్ల దగ్గరి నాసిరకమైన మట్టిని పోసి సోకు చేసేశారు. మరికొన్ని చోట్ల సిమెంట్‌తో అతుకులు వేశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
వేమీ పట్టించుకోకుండా బిల్లులు చెల్లించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆధునీకరణ పనుల్లో గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో పగుళ్లు ఇచ్చాయి. ప్రాజెక్టు బిడ్డింగ్ కూడా సక్రమంగా వేయకపోవడంతో పగులు ఇచ్చి కుంగిపోయే విధంగా తయారయ్యింది. ఇప్పటి వరకు చేసిప పనులకు సుమారు 40 కోట్ల వరకు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయల ఆఖరి బిల్లును చెల్లించేందుకు కూడ రంగం సిద్ధం అయింది.
ఆధునికీకరణ.. అస్తవ్యస్తం
Published Fri, Dec 27 2013 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement