పెళ్లకూరు : అన్నదాతలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులన్నీ కాంట్రాక్టర్ల బొక్కసంలోకి చేరుతున్నాయి. టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ చేసిన చెరువు మరమ్మతు పనులన్నీ నాసిరకంగా ఉండడంతో అధికారులు పనులు రద్దు చేశారు. అయితే అధికార పార్టీ అండతో హైదరాబాద్ స్థాయిలో బిల్లులు చేసుకుని సుమారు రూ.9.5లక్షల నిధులు స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని శిరసనంబేడు గ్రామంలో చిన్నప్పగుంట చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాలకు పైగా సేద్యం సాగుతోంది.
2014లో చెరువు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారు. చెరువు తూములు, కలుజు పనులను నిబంధనల మేరకు చేపట్టి, కట్ట ఉపరితలం మూడు మీటర్ల వెడల్పుతో మూడు లేయర్లు వేసి రోలింగ్ చేయించాలి. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ తనకున్న పొక్లెయిన్‌తో చెరువు కట్ట అంచు మట్టితీసి కట్టపై వేయించాడు. తూములు, కలుజు పనులన్నీ నాసిరరకంగా చేపట్టడం, కట్ట ఉపరితలం కనీసం 50 సెంటీమీటర్లు కూడా లేకపోవడంతో పలువురు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాసిరక పనులు పరిశీలించారు. నిబంధనల మేర పనులు చేపట్టకపోవడంతో పనులను రద్దు చేశారు.
సదరు కాంట్రాక్టర్ తనకున్న పలుకుబడితో బిల్లులు చేయించుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్ నుంచి నిధులు రికవరీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ సుబ్బారావుని వివరణ కోరగా ఉన్నతాధికారుల సూచనల మేరకు కాంట్రాక్టర్‌కు నిధులు తగ్గించి మంజూరు చేశామని చెప్పారు.
అధికార పార్టీ అండతో నిధులు స్వాహా
Published Sat, Jun 13 2015 2:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement