ఊసేలేని సిద్దేశ్వరం ప్రాజెక్టు
సాక్షి, కర్నూలు : కృష్ణానదిపై కొత్తపల్లి సమీపంలోని సిద్దేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మిస్తే రాయలసీమకు సాగునీటి విషయంలో న్యాయం జరుగుతుందని ప్రభుత్వాలకు తెలిసినా పట్టించుకోవడంలేదు. 854 అడుగుల ఎత్తులో ఆనకట్ట నిర్మాణం జరిగితే సాగు,తాగు నీటి సమస్య తొలగిపోతుంది. అయినా నిర్మాణం ఏళ్లతరబడి రికార్డులకే పరిమితమైంది. శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీటిమట్టం చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు నుంచి దిగువప్రాంతాలకు నీటిని విడుదల చేసుకోవచ్చుననే నిబంధనలు ఉన్నాయి. అయితే 860 అడుగులకు నీటిమట్టం చేరినా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసుకోవటానికి ప్రభుత్వాలు అనుమతిని ఇవ్వని దుస్థితి నెలకొని ఉంది. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల గరిష్టస్థాయి నీటినిల్వ సామర్థ్యాన్ని మెయింటెన్ చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవోను విడుదల చేశారు. అయితే దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మరించి గతంలో తాను విడుదల చేసిన జీవో మేరకు నీటిమట్టం 824 అడుగులకు చేరేవరకు నీటిని వాడుకోవచ్చని పేర్కొంటూ నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతాలకు ఇష్టారాజ్యంగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతాల ప్రజలు సాగు, తాగునీరు అందక ఇబ్బందిపడుతున్నారు. రాయలసీమకు గుండెకాయలాంటి పోతిరెడ్డిపాడు ద్వారా సాగు, తాగునీరు అందాలంటే తప్పనిసరిగా సిద్దేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాల్సిందేనని భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నించే సమయంలోనే ఆయన అకాలమరణం చెందారు. దీంతో ఐదేళ్లుగా ఆనకట్ట నిర్మాణం అటకెక్కింది.
గుండ్రేవుల పూరైతేనే నందికొట్కూరు, ఆత్మకూరులకు ప్రయోజనం..
శ్రీశైలం జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని రైతులు, ప్రజలకు ప్రయోజనం కలగాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు పనులు పూర్తిచేయాల్సి ఉంది. అంతేకాకుండా కేసీ కాల్వకు రావాల్సిన 12 టీఎంసీల నీటి వాటాలో జీవో నం. 3 ద్వారా అనంతపురం జిల్లాకు 10 టీఎంసీలు తరలించుకెళ్తున్నారు.
దీంతో 0-120 కిలోమీటర్ల మేర ఉన్న 60 వేల ఎకరాల ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రెండు కార్ల పంటలను పండించుకునే కేసీ రైతులు ప్రస్తుతం ఒక్క కారు పంటనూ సక్రమంగా పండించుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీ రైతులు రెండు కార్ల పంటలను సంమృద్ధిగా పండించుకోవాలంటే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి కేసీ రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే పెండింగ్‌లో ఉన్న మల్యాల ఎత్తిపోతల పథకం, జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి మెట్ట రైతుల పొలాలకు సాగునీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకాలు పూర్తికాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినా నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయమై అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అటకెక్కిన ఆనకట్ట!
Published Thu, Mar 5 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement