ఎర్రదొంగలపై ఉక్కుపాదం
- 15 మంది పీలేరు స్మగ్లర్లపై రహస్య విచారణ
- పోలీసు, అటవీశాఖల్లో ఇంటిదొంగలపై డీజీపీకి నివేదిక
- పరారీలో 12 మంది చిత్తూరు నగర స్మగ్లర్లు
- ఇంటిదొంగల ఆస్తుల జప్తునకు, అకౌంట్ల సీజ్‌కు సన్నాహాలు
సాక్షి, చిత్తూరు: జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లపై పట్టు బిగిస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు జిల్లాల స్మగ్లర్లు నలుగురిని అరెస్టు చేసి గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్‌జైలుకు పంపిన పోలీసులు పీలేరు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సహకారంతో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన మరో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
వీరికి తమిళనాడు, కర్ణాటకల్లోని బడా స్మగ్లర్లతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ? వీరు ఎర్రచందనం ఎక్కడికి తీసుకెళ్లి అప్పగిస్తున్నారు ? డబ్బు మా ర్పిడి ఎలా జరుగుతోందనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకుంటారోననే భయం స్మగ్లర్లకు కలిగింది.
ఈ క్రమంలో కేవీ పల్లి, పీలేరు, కలకడ, గుర్రంకొండ మండలాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న మధ్యవర్తులు, దళారులు ఊర్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. చిత్తూరు నగరంలోనూ 12 మంది స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్నవారు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిలో టీడీపీకి చెందిన వారు కూడా ఉన్నారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ యువనేత ఒకరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన మరో నాయకుడు కూడా పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకుంటారోనని అజ్ఞాతంలోకి వెళ్లారు.
ఇంటిదొంగలపై డీజీపీకి నివేదిక
అటవీ, పోలీసు శాఖల్లో ఉంటూ ఎర్రచందనం అక్రమరవాణాకు సహకరిస్తున్న వారిపై చిత్తూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. డీఎఫ్‌వో వైల్డ్‌లైఫ్, డీఎఫ్‌వో ఈస్టు పరిధిలోనూ, చిత్తూరు జిల్లా పోలీసు శాఖలోనూ ఇంటిదొంగలు ఎవరెవరనేది గుర్తించారు. అటవీశాఖలో రేంజర్‌స్థాయి అధికారులు, పోలీసు శాఖలో సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు ఉన్నట్లు సమాచారం. అటవీశాఖలో 16 మంది, పోలీసుశాఖలో 12 మంది ఉన్నట్లు గుర్తించి వీరిని సర్వీసు నుంచి డిస్మిస్ చేసేందుకు ఆమోదం కోసం డీజీపీకి పంపినట్లు తెలుస్తోంది.
ఇంటిదొంగలకు స్మగ్లర్లకు ఉన్న లింకును బయటపెట్టే ఆధారాలను, స్మగ్లర్ల నుంచి వీరి అకౌంట్లకు ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు బదలాయింపు జరిగిందనే వివరాలను కూడా పోలీసులు సేకరించారు. వీరి జీతం ఎంత ? కూడబెట్టిన ఆస్తుల వివరాలు ఏ మేరకు ఉన్నాయనే విషయూలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే వీరి అకౌంట్లను కూడా సీజ్ చేసేందుకు పై నుంచి ఉత్తర్వులు పొందనున్నట్లు సమాచారం.
ఎర్రచందనం కేసులపై ఉన్నతాధికారుల ఆరా
ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారంలో తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే విషయమై రాయలసీమ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ ఆరా తీశారు. ఇప్పటివరకు స్మగ్లింగ్‌లో కీలక భూమిక పోషిస్తున్న స్మగ్లర్లు, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లను ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా ? విదేశాలకు ఎర్రచందనం అక్రమ ఎగుమతుల్లో ప్రత్యక్షపాత్ర ఉన్నవారు ఎవరైనా దొరికారా ? అనే వివరాలను ఎస్పీల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలిసింది.