ప్లీనరీలో సిక్కోలు గళం
టీడీపీ మూడేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాలో అన్ని వర్గాలవారు తీవ్ర అగచాట్లు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట శనివారం ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ రెండ్రోజుల జాతీయ ప్లీనరీలో ఆమె జిల్లా సమస్యలపై గళం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలనుసారం జిల్లా సమస్యలపై ఆరు తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల పనులు, అప్పుల సహా రైతుల కష్టాలు, కిడ్నీ రోగుల ఆవేదన, మత్స్యకారుల సమస్యలు, గిరిజనులకు దూరమైన సంక్షేమం, చేనేతకారుల ఇబ్బందులను ఈ తీర్మానాల ద్వారా ప్రస్తావించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ పాలకులను పారదోలి రాజన్న సంక్షేమ పథకాల కోసం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారని రెడ్డి శాంతి ప్లీనరీలో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమ విధానాలు, దోపిడీ కార్యక్రమాలతో జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీల్లో తీర్మానాలు ఆమోదించినట్లు చెప్పారు. వాటిలో అత్యంత ప్రధానమైన సమస్యలపై ఆరు తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ఆమోదానికి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పది లక్షల మందికి వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలే ఆధారమన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తలపెట్టిన వంశధార ఫేజ్–2 ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులతో పాటు మడ్డువలస, నారాయణపురం ఆనకట్టల ఆధునికీకరణ పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జిల్లాలో మూడు లక్షల మంది మత్స్యకారుల పరిస్థితి నడిసంద్రంలో నావలా మారిందన్నారు. వారికి మరపడవలు, వలలు ఇస్తామని, కోల్డ్ స్టోరేజ్‌లు, జెట్టీలు నిర్మిస్తామని, 50 సంవత్సరాలకే పింఛను ఇస్తామని చంద్రబాబు పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాదు వారి సమస్యలపై చట్టసభలో వినిపించేందుకు వీలుగా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో 1.50 లక్షల మంది కారణం తెలియని కిడ్నీ రోగం బారిన పడ్డారని, వారిని ఆదుకునేందుకు శాశ్వత చర్యలు గాకుండా కంటితుడుపు చర్యలకే పరిమితమైందన్నారు. జిల్లాలో రెండు లక్షల మంది గిరిజనులకు సంక్షేమానికి వినియోగించాల్సిన సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని చెప్పారు.
దాదాపు 300 గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదన్నారు. రక్షిత తాగునీరు, సకాలంలో వైద్యం అందట్లేదన్నారు. ఇప్పటికీ చలమల్లో బురదనీరే గతి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మరో 50 వేల చేనేత కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని చెప్పారు. సిక్కోలు బ్రాండ్ పొందూరు ఖద్దరు ప్రపంచ ప్రసిద్ధి పొందినా ఆ పరిశ్రమపై ఆధారపడిన వారి సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్‌ను తామంతా భగవంతుడు పంపిన దూతగా భావిస్తున్నామని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజశేఖరరెడ్డి మాదిరిగా జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తారని రెడ్డి శాంతి ఆశాభావం వ్యక్తం చేశారు.
జగన్ పేరు ప్రతిపాదన...
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో సీఈసీ సభ్యులు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పార్టీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు పాల్గొన్నారు. ప్లీనరీలో నాయకుల ప్రసంగాలతో శ్రేణులతో జోష్ కనిపించింది. జిల్లా నుంచి ప్రధాన నాయకులతో పాటు దాదాపు రెండు వేల మంది వివిధ క్యాడర్ నాయకులు ప్లీనరీలో పాల్గొన్నారు.