సాక్షి, కర్నూలు : సన్న బియ్యానికి బాగా డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు జిల్లా నుంచి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులను వెతుకుతున్నారు. గతంలో ఆలూరు చెక్‌పోస్టు మీదుగా కర్ణాటకకు లేదా హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు రవాణా జరిగేది. ఇప్పుడు అక్రమార్కులు మార్గం మార్చారు. సమీప రాష్ట్రంలో ఉన్న అవకాశాలను గమనించి ఇక్కడి సర్కారుకు పన్ను ఎగ్గొడుతూ అక్కడికి తరలిస్తున్నారు.
ఇందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్చిన లెవీ సేకరణ నిబంధనలు వారికి కలిసొచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా లెవీ విధానాన్ని మార్చింది. గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమలవుతోంది. రైతుల నుంచి మిల్లరు కొనుగోలు చేసే వరి ధాన్యం సేకరణలోనే ఈ మార్పు జరిగింది. మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించిన అనంతరం సదరు మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కి 75 శాతం ఇవ్వాల్సి ఉండేది.
మిగతా 25 శాతం తనకు తాను విక్రయించుకునే వెసులుబాటు ఉండేది. ఇది పాత విధానం. గత ఏడాది అక్టోబరు ఒకటి నుంచి నిబంధనలు మార్చింది. వ్యాపారులు లేదా మిల్లర్లు సేకరించిన ధాన్యంలో మర ఆడించిన తరువాత 25 శాతం ప్రభుత్వానికి ఇస్తే చాలు. మిగతా 75 శాతం నిల్వ చేసుకోవచ్చు లేదా మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా నిబంధనలు మార్చినా ఆ నిబంధనల్లో ఉన్న కొన్ని లోటుపాట్లను వ్యాపారులు అవకాశంగా మార్చుకుంటున్నారు.
తెలంగాణకు తరలింపు..
ప్రస్తుతం జిల్లాల వారీగా లెవీ సేకరణతోపాటు ప్రభుత్వ అవసరాలకు కూడా జిల్లాలే ప్రాతిపాదికగా బియ్యం సేకరణ జరుగుతోంది. ప్రస్తుతం 25 శాతం ప్రభుత్వానికి లెవీ ఇస్తే చాలు.. మిగతాది వ్యాపారులు విక్రయించుకోవచ్చు.
ఇక్కడే అసలైన గోల్‌మాల్ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వసతి గృహాల్లోని విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు సగటుతో పోల్చితే దిగుబడులు కూడా కొంత అక్కడి జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డిలలో సన్న బియ్యం డిమాండ్ ఎప్పుడూ ఉండనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని వివిధ బ్రాండ్ల పేరిట విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడంలో ఎలాంటి తప్పులేదు. కృత్రిమ కొరత సృష్టించడంతో పాటు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఇక్కడి నుంచి తరలించడమే అసలైన అభ్యంతరంగా భావించవచ్చు.
పన్ను చెల్లింపు లేకుండా..
నిబంధనల ప్రకారం ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించాలంటే పన్నులు చెల్లించాలి. స్థానిక మార్కెట్ యార్డుకు 2 శాతం, వాణిజ్య పన్నుల శాఖకు 5 శాతం పన్ను చెల్లించాలి. అదే వే బిల్లుపై ఒకే ట్రిప్పును తరలించాలి. ఇవేమీ లేకుండానే జిల్లా నుంచి రోజుకు కనీసం పది లారీల బియ్యం అంటే 150 టన్నులు తరలివెళుతోంది. ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అక్కడ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అటు అక్కడి ప్రజలకు నష్టం వాటిల్లుతోందని కొందరు వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
కృత్రిమ కొరతకు వ్యూహం..
ప్రస్తుతం జిల్లాలో 75 శాతం వరకు నూర్పిళ్లు పూర్తయ్యాయి. మొత్తం దిగుబడుల్లో 75 శాతానికిపైగా మార్కెట్‌కు వస్తోంది. మిగిలిన 25 శాతం రైతులు నిల్వ చేసుకుంటారు. ఇలా నూరు శాతం నూర్పిళ్లు పూర్తికావడంతో పాటు మరికొన్ని రోజులు గడిస్తే గత ఖరీఫ్ బియ్యం పాతవి అవుతాయి. డిమాండ్ పెరుగుతుంది. అప్పటికల్లా వ్యాపారుల చేతిలోనే సరుకు ఉంటుంది. ఈలోగా వీలైనంతవరకు సన్న బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలించేస్తే ఉన్న సరుకును బ్లాక్ చేయవచ్చు. ధరలు పెంచి విక్రయించుకోవచ్చు. ప్రభుత్వం దాడులు చేసినా తమ వద్ద ఉన్న సరుకు గరిష్ట పరిమితికి లోపే ఉంటుంది.
ఎటు చూసినా తామే లబ్ధి పొందవచ్చన్న ఉద్దేశం కూడా వ్యాపారుల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. అంతేకాదు, త్వరలో ప్రభుత్వ అవసరాలకు అంటే వసతి గృహాలకు, ఇతరత్రా కార్యక్రమాలకు కూడా సన్న బియ్యం వినియోగించనుంది. దీంతో డిమాండ్ మరింత పెరుగుతుంది. ఆ మేరకు ధరలూ పెంచుకోవచ్చన్న ఉద్దేశంతో కొందరు వ్యాపారులు తరలించేస్తున్నారు.
సన్న బియ్యం దారి మళ్లింపు!
Published Wed, Feb 25 2015 2:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement