సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలోని 239 మద్యం దుకాణాలకు 5,323 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా రూ.22.80 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. కానీ గతసారితో పోల్చితే ఆదాయం పెరిగినా దరఖాస్తుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. గతంలో 6,267 దరఖాస్తులు వచ్చాయి. రెండేళ్ల కాలపరిమితితో అనుమతి కోసం మద్యం దుకాణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ అయ్యింది.
ఈ మేరకు గురువారం సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల దాఖలుకు గడువు ముగిసింది. కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో మూడు గంటల పాటు గడువు పొడిగించారు. ఎట్టకేలకు 5,323 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటి పరిశీలన కూడా గురువారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. రాత్రి 10 గంటల సమయానికి 3,783 దరఖాస్తులకు ఎంట్రీపాస్ లభించింది. మిగిలిన 1,540 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.
జిల్లాలో కొన్నిచోట్ల మద్యం దుకాణాలకు టెండర్లు వేయవద్దంటూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కొంతమంది ఎక్సైజ్ అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వేలం ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణమండలంలో లాటరీ ద్వారా వేలం పాట నిర్వహించనున్నారు.
మద్యం దుకాణాలకు తగ్గిన దరఖాస్తులు
Published Fri, Mar 31 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
Advertisement
Advertisement