సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ ఏడాది (2019–20)కి మద్యం పాలసీని ప్రకటించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,380 మద్యం షాపులుండగా తొలి ఏడాదే వీటిలో 880 తగ్గించి 3,500కి కుదించింది. వీటిని ప్రభుత్వమే నిర్వహించనుంది. షాపులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఏర్పాటు చేయనుంది. వీటికి ఏపీఎస్‌బీసీఎల్ రిటైల్ ఔట్‌లెట్‌గా నామకరణం చేస్తారు. వీటిపై షాపు నెంబర్ కూడా ఉంటుంది. జిల్లాలవారీగా షాపుల సంఖ్యపై ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు.
షాపుల ఏర్పాటుపై విధివిధానాలివే..
- మద్యం షాపులను ఎక్సైజ్ చట్టం–1968 రూల్స్ ప్రకారం ఏర్పాటు చేయాలి. ఒక్కో షాపు 150 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల లోపు ఉండాలి. పక్కా నిర్మాణంతో రోడ్డుకు అభిముఖంగా, ఒకే డోర్‌తో నిర్మించాలి. మొదటి అంతస్తులోనే షాపు ఉండాలి. ఎమ్మార్పీ ధరలను సూచించే బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి.
- మద్యం షాపులో సీలింగ్ ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు, ఐరన్ ర్యాక్‌లు, ఎలక్ట్రికల్ సబ్ మీటర్, దొంగ నోట్లను గుర్తించే డిటెక్టర్, సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్‌వేర్ ఉండాలి.
- ఏడాదికి మాత్రమే షాపు అద్దె అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్ టు టైమ్ పొడిగించుకోవాలి.
- ప్రతి మద్యం షాపులో అర్బన్ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉంటారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపులో ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్, ఒక వాచ్‌మెన్, గ్రామీణ ప్రాంతాల్లోని షాపులో సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్, ఒక వాచ్‌మెన్ ఉంటారు.
- షాపు సూపర్‌వైజర్‌కు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండి, మద్యం షాపు ఎక్కడ ఏర్పాటవుతుందో ఆ మండలానికి చెందినవారై ఉండాలి. విద్యార్హత డిగ్రీ. బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. షాపు సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు స్థానికులై ఉండాలి. సూపర్‌వైజర్‌కు నెలకు రూ.17,500 జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, సేల్స్‌మెన్‌కు నెలకు రూ.15 వేల జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పిస్తారు.
కాంట్రాక్టు విధానంలో సిబ్బంది ఎంపిక
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అర్హులైనవారు ఆన్‌లైన్‌లో ఏపీఎస్‌బీసీఎల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారికి కాంట్రాక్టు విధానంలో ఏడాది పాటు మద్యం షాపులో పనిచేసే అవకాశం ఉంటుంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను ఆయా డిపో మేనేజర్ అనుమతితో ఇస్తారు. సూపర్‌వైజర్ లేదా సేల్స్‌మెన్ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని రెండో ఏడాది కొనసాగించవచ్చు. రెండో ఏడాదిలో ఓ నెల రెమ్యునరేషన్‌ను బోనస్‌గా ఇస్తారు. మద్యం షాపులో రోజువారీ లావాదేవీలు, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్ సూచించే పనులను సూపర్‌వైజర్ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్, మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్‌వైజర్ సూచించే బాధ్యతలను సేల్స్‌మెన్ నిర్వహించాల్సి ఉంటుంది. మద్యం షాపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలి. మద్యం షాపులో ఏదైనా నష్టం సంభవిస్తే సిబ్బందిదే పూర్తి బాధ్యత. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు మద్యం షాపుల ఏర్పాటు, రవాణా, సిబ్బంది ఎంపికలను పర్యవేక్షిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment