
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీగా మద్య నిషేధం దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని మద్యం విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా కొరిటెపాడులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తుండటంతో ఇప్పటికే మద్యం వినియోగం 40 శాతం, బీరు వినియోగం 78 శాతానికి తగ్గిందని వెల్లడించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను, పర్మిట్ రూమ్‌లను పూర్తిగా తొలగించడమే కాకుండా.. మద్యం షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి 4,400 మద్యం దుకాణాలను 2,900కు తగ్గించారని గుర్తు చేశారు. నవంబర్ 1న కర్నూలులో మద్యం విమోచన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీ ప్రాంగణాలు, డిగ్రీ కాలేజీల్లో డ్రగ్స్, మత్తు పానీయాలపై సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదే
దివంగత నందమూరి తారక రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. 1994 నుంచి ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రంలో సత్ఫలితాలిచ్చిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే కోట్లాది మంది మహిళలు సాధించుకున్న సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారన్నారు.