నీ జోలి నాకొద్దు పో.. పోవయ్యా | Refusing to keep shaking the cadalavada | Sakshi
Sakshi News home page

నీ జోలి నాకొద్దు పో.. పోవయ్యా

Published Sat, Apr 19 2014 3:56 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

నీ జోలి నాకొద్దు పో.. పోవయ్యా - Sakshi

నీ జోలి నాకొద్దు పో.. పోవయ్యా

  • వెంకటరమణ కరచాలనాన్ని నిరాకరించిన చదలవాడ
  •  కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టిన కృష్ణమూర్తి
  •  బావ కన్నీళ్లు చూసి విలపించిన ఎన్వీ ప్రసాద్
  •  రెండు రోజుల్లో భవిష్యత్ చెబుతానన్న చదలవాడ
  •  మారిన రాజకీయ పరిణామాల్లో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ పట్టుబట్టి మరీ తిరుపతి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఈ టికెట్ కోసం మొదటి నుంచి పోటీపడుతున్న తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన వెంకటరమణను తనతో మాట్లాడవద్దంటూ బయటకు పంపించేశారు. తెలుగుదేశం అధినేత తనకు చేసిన అన్యాయాన్ని తలచుకుని కార్యకర్తల సమావేశంలో కంటతడి పెట్టారు. తన భవిష్యత్  కార్యాచరణను సోమవారం ప్రకటిస్తానని చెప్పారు.
     
    సాక్షి, తిరుపతి : రెండేళ్ల కిందట తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం వెంకటరమణ, తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన భూమన కరుణాకరరెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న చదలవాడ కృష్ణమూర్తి తనకే టికెట్టు ఖాయమని రెండు నెలలుగా ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు.

    ఇటీవల మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చదలవాడ, వెంకటరమణల మధ్య టికెట్టు పోరు మొదలైంది. చివరి రోజు వరకు నాన్చిన చంద్రబాబు శుక్రవారం తిరుపతి నుంచి వెంకటరమణ పేరు ఖరారు చేశారు. దీంతో ఆవేదనకు గురైన చదలవాడ శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చదలవాడ ఉద్వేగపూరిత ప్రసంగం చేస్తుండగా, టికెట్టు దక్కించుకున్న వెంకటరమణ అనుచరులతో అక్కడికి వచ్చారు.

    ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. వెంకటరమణ నేరుగా వెళ్లి చదలవాడకు పూలబొకే అందజేసేందుకు ప్రయత్నించారు. వెంకటరమణ వైపు సూటిగా చూసేందుకు కూడా మనస్కరించని చదలవాడ వెళ్లిపోవాల్సిందిగా చేతులతో సంకేతాలిచ్చారు. కాని పట్టువదలని వెంకటరమణ బలవంతంగా చదలవాడ చేతుల్లో బొకే ఉంచి ఆయన కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా వెంకటరమణను నువ్వెళ్లయ్యారూ.రూ. అంటూ చదవలవాడ పదేపదే చెప్పడంతో ఆయన నిష్ర్కమించారు. కోపం తగ్గిన తరువాత మాట్లాడవచ్చని పక్కనే ఉన్న మరో గదిలోకి వెంకటరమణ వెళ్లారు. అర్ధగంట పాటు వేచిచూసినా అవకాశం రాకపోవడంతో తిరుగుముఖం పట్టారు.
     
     కంటతడిపెట్టిన చదలవాడ

     వెంకటరమణ వెళ్లిపోయిన తరవాత కార్యకర్తలు, తన వర్గీయులతో చదలవాడ సమావేశం కొనసాగించారు. కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని అవకాశవాదంతో పార్టీ మార్చిన వారికి టికెట్టు ఇవ్వడాన్ని నిరసించారు. తాము రాజీనామాలు చేసి అండగా ఉంటామని చెప్పడంతో చదలవాడ కంటతడిపెట్టారు. కార్యకర్తలు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. అప్పుడే సమావేశానికి హాజరైన చదలవాడ బావమరది ఎన్వీ ప్రసాద్ కూడా బోరున విలపించారు. దీంతో సమావేశం ఆవేదనభరితంగా మారింది. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని చదలవాడ భరోసా ఇచ్చారు. తాను నడుపుతున్న కేబుల్‌టీవీకి సంబంధించి ఏరియాల వారీగా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి వారికి ఆర్థికంగా సహకరిస్తానని చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను సోమవారం వెల్లడిస్తానన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement