ముప్పేట దాడి
- టీడీపీ అభ్యర్థి ఓట్లకు గండికొడుతున్నఇతర పార్టీల అభ్యర్థులు
- ఆటోవాలా కందాటి శంకర్‌రెడ్డితో టీడీపీ ఓట్లకు చిల్లు
- కాంగ్రెస్ ఓట్లు గణనీయంగా చీల్చే పనిలో జేఎస్పీ అభ్యర్థి
- చంద్రబాబు అధికారంలోకి వచ్చేదీలేదు.. టీటీడీ చైర్మన్ అయ్యేదీ లేదంటున్న చదలవాడ వర్గీయులు
సాక్షి, తిరుపతి: కులం కార్డు, కాంగ్రెస్ ఓట్లలో చీలిక, టీడీపీ నికర ఓట్లతో ఎమ్మెల్యే అయిపోతాననుకున్న మాజీ ఎమ్మెల్యే ఎం వెంకటరమణకు బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అన్ని రకాల సమీకరణలు, అంచనాలతో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ టికెట్టు తెచ్చుకున్న ఆయన లెక్కలు తప్పుతున్నాయి. ఏ వర్గాల ఓట్లు తనకు శ్రీరామరక్ష అనుకుంటున్నారో అవి ఆయన ఖాతాలో జమయ్యే పరిస్థితి లేదని ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది.
దీంతో తన దగ్గరకు వచ్చే నాయకుల వద్ద ఆయన తీవ్ర అసహనం వెలిబుచ్చుతున్నారు. మారిన సమీకరణలు వెంకటరమణను, ఆయన కోటరీని గుడ్లు తేలేసేలా చేస్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిపిన రోడ్ షోలో వాడిన బీసీ ట్రంప్‌కార్డు వెంకటరమణ కొంపముంచుతోంది. తిరుపతి టికెట్టు బీసీలకు ఇచ్చినట్టు చంద్రబాబు ప్రకటించడంతో కీలకమైన యాదవ సామాజికవర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు యాదవ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటన వారి ఆశలను నీరుగార్చింది. టీడీపీలోని యాదవ సామాజికవర్గం నేతలు చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఆటోతో సైకిల్ ఓట్లకు చెక్...
తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కందాటి ఇటీవల రాజకీయంగా మౌనంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా ఎన్నికల బరిలో నిలవడంతో టీడీపీ ఓట్లకు భారీగా గండిపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శంకర్‌రెడ్డికి అండగా కొందరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని కొన్ని మాస్ ఏరియాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. ఇక్కడ టీడీపీకి రావాల్సిన ఓట్లు ఆటో ఖాతాలో వేసుకునేందుకు ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఆటోకు ఎంత ఎక్కువ ప్రచారం జరిగితే అంత నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు.
కలవరపెడుతున్న పాదరక్షలు
మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు పీ నవీన్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నగరం నలుమూలలా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వెంకటరమణకు వణుకు పుట్టిస్తున్నారు. వెంకటరమణ, నవీన్ ఎన్నికల ముందువరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినవారే. కాంగ్రెస్‌వాదిగా మాజీ ఎమ్మెల్యేకు పట్టున్న ప్రాంతాలపై నవీన్ పట్టుబిగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జేఎస్పీ అభ్యర్థి గురిపెట్టారు. వెంకటరమణకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్న ముఖ్యులను కలుసుకుని తనకు సహకరించాలని నవీన్ అభ్యర్థిస్తున్నారు. ఈ రకంగా టీడీపీ అభ్యర్థికి కలసివస్తాయనుకుం టున్న కాంగ్రెస్ ఓట్లకు గాలం వేస్తున్నారు. దీంతోపాటు ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న వారు వెంకటరమణ హఠాత్తుగా పార్టీ మారడం జీర్ణించుకోలేకున్నారు. వారంతా వెంకటరమణకు సహరించే పరిస్థితి లేదు.
బాబు అధికారంలోకి వస్తే గదా చైర్మన్ అయ్యేది..
మాయమాటలతో మభ్యపెట్టడంలో నెంబర్ వన్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు హామీని టికెట్టు కోసం ప్రయత్నించి భంగపడ్డ చదలవాడ కృష్ణమూర్తి వర్గీయులు నమ్మడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అధినేత అనుమతితో నగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే తీరా టికెట్టు ఇచ్చే సమయానికి హ్యాండిచ్చిన చంద్రబాబును వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ మార్చడం కంటే అదే పార్టీలో ఉంటూనే తన తడాఖా చూపించేందుకు చదల వాడ సిద్ధమవుతున్నారని అంటున్నారు.
పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న తరువాత టికెట్టు నిరాకరించిన చంద్రబాబును నమ్మడమంత ఆత్మహత్యాసదృశం మరొకటి ఉండదని వారు స్పష్టమైన అవగాహనకు వచ్చారు. దీంతో సామాజికవర్గం ఓట్లను వీలైనంతగా ప్రభావితం చేయడం ద్వారా అధినేతకు బుద్ధిచెప్పాలని భావిస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన వెంకటరమణ కూడా చదలవాడను పూర్తిగా నమ్మడం లేదు. ఎన్నికల విషయాల్లో జోక్యం తగ్గిస్తున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో ఎవరి పనిలో వారు ఉన్నారు.
కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లకు మబ్బు ఎసరు
ఇంకా ఎక్కడైనా కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు మిగిలి ఉంటే అవి కాస్త తన ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ అభ్యర్థి మబ్బు దేవనారాయణరెడ్డి కృషి చేస్తున్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆ ఓట్లు తన ఖాతాలో జమ అవుతాయని భావించిన వెంకటరమణకు ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది. మొత్తానికి వెంకటరమణ తొలుత వేసుకున్న అంచనాలకు ఇప్పుడున్న పరిస్థితులకు పూర్తిగా వ్యత్యాసం ఉందని స్పష్టమవుతోంది.