ప్రాంతీయ అసమానతలకు మళ్లీ ఆజ్యం
హైదరాబాద్: 'ఏ ప్రాంతీయ వాదమైతే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందో మళ్లీ అదే ప్రాంతీయ అసమానతలకు దారితీసేలా చంద్రబాబు అభివృద్ధి నమూనా ఉంది. చంద్రబాబు రాజకీయంగా దూరదృష్టితో ఆలోచించడం లేదు. కొత్త రాష్ట్రం మళ్లీ ముక్కలు కాకూడదు' అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు.
తామేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, వాళ్లు తమను అర్థం చేసుకుంటారన్నారు. ఆదివారం నుంచి సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగనున్న తరుణంలో రాఘవులు శుక్రవారం ఇక్కడి ప్రకృతి చికిత్సాలయంలో 'సాక్షి ప్రతినిధి'తో మాట్లాడారు. 1997 డిసెంబర్ నుంచి 2014 మార్చి వరకు ఉమ్మడి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన రాఘవులు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి
తెలుగుదేశం అభివృద్ధి నమూనా సామాన్యులకు ఉపయోగపడేలా లేదు. రాజధానికి భూసమీకరణే దీనికి ఉదాహరణ. వేలాది ఎకరాల భూమిని సేకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ అధికారులు 1,015 ఎకరాలు చాలంటుంటే 30 వేల ఎకరాలు కావాలని మంత్రులంటున్నారు. ఇదంతా ఎవరికోసం? కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఎంత నష్టం జరిగిందో హైదరాబాద్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాల్సింది. విజయవాడ రాజధానిలోనూ కోటి మంది జనాభా ఉండేలా నగరం ఎం దుకు? ఇంత జనాభా ఒకేచోట ఉండాలం టే బాబే చెప్పినట్టు ఒక్కొక్కరు పది మందిని కనడమో లేక పెద్దఎత్తున వలసల్ని ప్రోత్సహించడమో చేయాలి. ఎక్కడికక్కడ అభివృద్ధి చేయడానికి బదులు మళ్లీ కేంద్రీకృతం చేస్తే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. రాష్ట్రం మళ్లీ ముక్కలవకుండా చూడాలి.
బాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు..
చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలు.
ముందు వాటిని అభివృద్ధి చేయాలి. దీనికి బదులు అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే తిప్పితే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు బయలుదేరతాయి. బాబు నమునాతో సామాజిక న్యాయం లేకుండా పోయింది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చెల్లాచెదురుగా ఉన్న గిరిజనుల అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు. సికిల్ అనీమియా(సాక్షిలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ), రక్తహీనత, మలేరియా వంటి వ్యాధులు ప్రబలినా పట్టించుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీకి బదులు కేంద్రం ముష్టి రూ.350 కోట్లు ఇస్తే అదేమని అడగడానికి నోరురాని చంద్రబాబు ఐదు కోట్ల మందికి ఏదో చేస్తాడని భావించలేం.
బూర్జువా పార్టీలతో కలసి పోటీచేయం..
మున్ముందు బూర్జువా పార్టీలతో, అదే భావజాలమున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేయం. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, కలయికకే ప్రాధాన్యం. ప్రజాసమ స్యలపై ఎవరితోనైనా కలిసి పోరాటం చేస్తాం. కమ్యూనిస్టులు కలిస్తే పెద్ద శక్తే. దానిని గౌరవిస్తాం. ముందు రాజకీయ ఏకీభావం ఉండా లి. ఐక్యమై మళ్లీ విచ్ఛిన్నం కాకూడదు కదా..
ప్రజలకు ఆ విషయం తెలుసు...
ఓట్లు, సీట్లు లేని పార్టీలు నిజమైన ప్రతిపక్ష పాత్ర ఏం పోషిస్తాయంటున్నారు కొందరు. సీట్లు లేనిమాట నిజమేగానీ చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది మాత్రం కమ్యూనిస్టులే.. ప్రజలకు ఆ విషయం తెలుసు.
పోరాటాలపై మహాసభల్లో కార్యాచరణ
చంద్రబాబు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచుతామంటున్నారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధించారు. రుణమాఫీ పెద్ద గోల్‌మాల్ అయింది. కౌల్దార్లకు, డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వాటిని విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోరా టాల పై కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొం దిస్తాం. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర తొలి మహాసభలు జరుగుతున్నాయి. సమర్థ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కృషి చేస్తాం.