
రియల్టర్ల బేజారు
వుడా వీసీ లేఅవుట్ల విషయంలో ఆంక్షలు కఠినతరం చేస్తుండటంతో రియల్టర్లకు చెమటలు పడుతున్నాయి.
రెండు మాసాలుగా జారీ కాని ఎల్‌పీసీలు
నిబంధనలు కఠినతరం చేసిన వుడా వీసీ
అయోమయంలో పడ్డ రియల్టర్లు
ఆగిన రూ. కోట్ల లావాదే వీలు
విశాఖపట్నం సిటీ: వుడా వీసీ లేఅవుట్ల విషయంలో ఆంక్షలు కఠినతరం చేస్తుండటంతో రియల్టర్లకు చెమటలు పడుతున్నాయి. తమ ఎత్తుగడలు ఫలించకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. లేండ్ పొజిషనింగ్ సర్టిఫికెట్లు(ఎల్‌పీసీ) నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రెండు మాసాలుగా ఒక్క ఎల్‌పీసీ జారీ కాలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. రూ. కోట్లు పెట్టుబడి పట్టి కొన్న భూములకు వుడా నుంచి ఎల్‌పీసీ రాకపోవడంతో జనానికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక తలపట్టుక్కూర్చున్నారు. ఎల్‌పీసీ త్వరలో వచ్చేస్తుందంటూ భూములు కొనుగోలు చేసిన వారి నుంచి రియల్లర్లు రూ. లక్షల్లో అడ్వాన్సులు స్వీకరించారు. నిన్న మొన్నటి వరకూ రేపు మాపు అంటూ కాలం గడిపారు. ఇప్పుడు వుడాలో తమ మాట చెల్లకపోవడంతో మొహం చాటేస్తున్నారు. లే అవుట్ల విషయంలో వుడా వైస్‌ఛైర్మన్ బాబూరావు నాయుడు తీసుకొచ్చిన ఆంక్షలతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోవడంతో తాజా పరిస్థితి తలెత్తింది. గతంలోనోట్ల మాయాజాలంతో ఫైళ్లను నడిపిన రియల్టర్ల వ్యూహాలు ఇప్పుడు ఫలించడం లేదు.
రియల్టర్లు రైతుల నుంచి భూమి కొంటారు. ఆ భూమి త మ అధీనంలో ఉందని వుడా ఎల్‌పీసీ ఇస్తుంది. ఇలా ఎల్‌పీసీ ఇచ్చిన తర్వాతే దాన్ని ప్లాట్లుగా వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్లాటును వెంటనే అమ్ముకునేందుకు అవకాశం కలుగుతుంది. ఎల్‌పీసీ జారీకి గతంలో ఎలాంటి సమస్యా ఉండేది కాదు. పేరొందిన రియల్టర్లు దరఖాస్తు చేస్తే ముందు వెనకా చూడకుండా క్షణాల్లో ఎల్‌పీసీ జారీ అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లే దు. గత రెండు మాసాలుగా 100కు పైగా కొత్త లే అవుట్ స్థలాలన్నింటికీ ఎల్‌పీసీలను నిలిపివేశారు. ఎక్కడి ఫైళ్లను అక్కడే తొక్కి పెట్టేశారు. తమ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది కాస్త చూడండి అంటూ ఎవరినైనా కదిపితే చాలు...వారికి మరింత అదనపు సమాచారం కావాలంటూ ఉడా అధికారులు నోటీసులిస్తున్నారు.
రియల్టర్ల పై భారం..!:ఎల్‌పీసీ కోసం దరఖాస్తు చేసుకునేవారిని వుడా అధికారులు స్థలానికి సంబంధించిన పాస్‌బుక్ తెమ్మంటున్నారు. తహశీల్దార్లు ఆ బుక్‌లను గత కొద్ది మాసాలుగా జారీ చేయడం లే దు. మరి ఆ బుక్‌ను ఎలా తీసుకురమ్మంటున్నారో అధికారులకే తెలియాలని రియల్టర్లు అంటున్నారు. వాస్తవానికి మీ సేవలోని అడంగల్ తీస్తే అది ఎవరు కొన్నారో తెలిపే జిరాయితీ సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను పరిశీలించైనా స్థల నిర్ధారణ చేసుకుని అనుమతి ఇవ్వవచ్చు. కానీ వుడా అధికారులు అలా కాకుండా అన్ని అనుమతులు ఒకే పేరున కావాలని అడగడంతో రియల్టర్లు భారీగా నష్టపోతున్నారని చెబుతున్నారు.
లిటిగేషన్ లేకుండా ఉండేందుకే..!
ఎల్‌పీసీలను త్వరితగతిన క్లియర్ చేద్దామనుకుంటున్నాం. చాలా చోట్ల భూములు లిటిగేషన్లలో వున్నాయి. అవన్నీ పరిశీలించాక అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకూ అటెస్టడ్ డాక్యుమెంట్లను పరిశీలించి అన్నీ జారీచేసేవాళ్లం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు చూస్తేనే గానీ ఇవ్వలేం. భవిష్యత్తులో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. భూమి ఎవరిదో స్పష్టంగా తేలకుండానే ఎల్‌పీసీలు జారీ చేయలేం. నిబంధనల మేరకు అన్నీ ఉంటే ఓకే చేస్తా..!
-డాక్టర్ టి. బాబూరావు నాయుడు
వైస్ ఛైర్మన్-వుడా