కొడుకు బదులుగా తండ్రిపై కేసు నమోదు
రేపల్లె: రేపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ అధికారులు చట్టాలకు కొత్త భాష్యం చెబుతున్నారు. తప్పు చేసిన కొడుకు స్థానంలో తండ్రిపై కేసు నమోదు చేశారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్‌షాపుల నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది ఈనెల 4వ తేదీ రాత్రి పోతాబత్తుని ముక్తేశ్వరరావు, తమ్ముడు రామకృష్ణల ఇళ్ల వద్ద సోదాలు నిర్వహించగా మద్యం బాటిల్స్ లభించాయి. దీంతో ముక్తేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
రామకృష్ణ ఇంటివద్ద లేకపోవటంతో రాగానే స్టేషన్‌కు తీసుకురావాల్సిందిగా అతడి తండ్రి సాంబశివరావుకు, గ్రామ పెద్దలకు చెప్పి వచ్చేశారు. సోమవారం ఇంటికి వచ్చిన రామకృష్ణను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడి ఆరోగ్యం సరిగా లేదని, మంగళవారం ఉదయం మళ్లీ స్టేషన్‌కు తీసుకొస్తామని చెప్పి పూచికత్తుపై గ్రామ పెద్దలు రామకృష్ణను ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కథ మారింది.
స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు రామకృష్ణకు బదులు ఎలాంటి సంబంధం లేని అతడి తండ్రి, వైఎస్సార్ సీపీ నాయకుడైన సాంబశివరావుపై కేసు నమోదు చేశారు. అంతలోనే కోర్టుకు హాజరు పరచటం జరిగిపోయింది. ముక్తేశ్వరరావును అదుపులోకి తీసుకున్నప్పటికీ కోర్టుకు హాజరుపర్చలేదు.
తప్పుచేసింది తానని, ఏపాపం ఎరుగని తన తండ్రిని వదిలేయాలని ప్రాధేయపడినా వినలేదని రామకృష్ణ కన్నీటి పర్యంతమయ్యాడు. దీనిపై సీఐ నరసింహారావును ప్రశ్నించగా గ్రామ పెద్దలు, నిందుతుడి తండ్రి సూచన మేరకే రామకృష్ణ బదులు సాంబశివరావుపై కేసు నమోదు చేశామని చెప్పారు.
చట్టాలకు ఎక్సయిజ్ పోలీసుల కొత్త భాష్యం
Published Wed, Jan 7 2015 2:35 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement