మద్యం వరదలా..
ఐదు నెలల్లో రూ.5775 కోట్లు తాగేశారు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి నెలా సగటున రూ. 1000 కోట్లకు పైగా విలువైన మద్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో జరిగిన మద్యం అమ్మకాల విలువ రూ. 5775 కోట్లు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోగా... ఆబ్కారీ శాఖకు వచ్చిన రెవెన్యూ రూ. 5, 729.77 కోట్లు. గతేడాది (2015)లో ఐదు నెలల్లో రూ. 4,692 కోట్ల మద్యాన్ని విక్రయించగా, ఈసారి 23 శాతం వృద్ధితో అదనంగా రూ. 1000 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయడం గమనార్హం.
వ్యాట్ రూపంలో రూ. 3,770 కోట్లు
ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాల ద్వారా ఐదు నెలల్లో రూ. 5,775 కోట్లు ఆర్జించగా, అందులో నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వమే 65 శాతం తన ఖాతాలో వేసుకుంది. విక్రయించిన ప్రతి మద్యం సీసాకు లెక్కలేసి మరీ వ్యాట్ బై ఎక్సైజ్ రూపంలో రూ. 3,770 కోట్లు లాగేసుకుంది. ఇక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 93.75 కోట్లు చేరింది. ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన వాటా ఆబ్కారీ శాఖ నుంచే కావడంతో ఇదే రీతిన మద్యం అమ్మకాలు సాగిస్తే వచ్చే సంవత్సరం (2017) మార్చి నాటికి రూ. 14,161 కోట్ల రెవెన్యూ సాధించాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో సర్కార్‌కు ‘వ్యాట్ బై ఎక్సైజ్’ కింద రూ. 9,618 కోట్లు పన్ను రూపంలో వెలుతుంది. కాగా లక్ష్యం సాధనకు జిల్లాల వారీగా టార్గెట్‌లు నిర్ణయించిన ఎకై ్సజ్ అధికారులు తదనుగుణంగా అమ్మకాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. 2015 కన్నా 2016లో బీర్లు, ఐఎంఎల్ విక్రయాలు భారీగా పెరిగి ఏకంగా 32 శాతం వృద్ధి సాధించాయి.