21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే! | Abkari Department alert to the wine shops and bars | Sakshi
Sakshi News home page

21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే!

Published Thu, Jul 14 2016 3:02 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే! - Sakshi

21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే!

రాష్ట్రంలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ హెచ్చరిక
 
 సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో ఈనెల 1న కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆబ్కారీ శాఖ మేల్కొంది. 21 సంవత్సరాల వయస్సు లోపు వారికి మద్యం విక్రయించకూడదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాపీ అవర్స్ పేరుతో మద్యం, బీర్లపై ఆఫర్లు ఇచ్చే బార్లు, ఈవెంట్ నిర్వాహకులకు ఆబ్కారీ చట్టం సెక్షన్ 3 కింద నోటీసులు పంపించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు ఆయా బార్ల లెసైన్సులను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు అధికారులతో సమావేశమైన ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్.. ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి 21 ఏళ్లలోపు వయస్సు వారికి మద్యం విక్రయం, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి అంశాలను పునస్సమీక్షించాలని నిర్ణయించారు. అలాగే తమిళ నాడు, కర్ణాటక, కేరళల్లో ఉన్న నిబంధనలు, చట్టాలను అధ్యయనం చేయనున్నారు.

 జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక నిఘా : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న కేసులు ఎక్కువగా జరుగుతుండటంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 522 బార్లు, పబ్బులపై తరచూ దాడులు జరపాలని నిర్ణయించారు. బార్లకు వచ్చే వారిపై అనుమానం వస్తే వయస్సు ధ్రువీక రించే పత్రాలను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం 61 బార్లలో తనిఖీలు జరిపారు. ప్రతి రోజు తనిఖీలు కొనసాగాలని ఆదేశిస్తూ.. బాధ్యతను ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అప్పగించారు. 1968 ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36 (ఎఫ్) ప్రకారం ఎక్సైజ్ అధికారులకు బ్రీత్ అనలైజర్లు అందించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలించాలని ప్రతిపాదించారు. ప్రతి బార్, రెస్టారెంట్, పబ్బుల్లో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయించడంతోపాటు పోలీస్ శాఖ తరహాలో సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసే అంశంపైనా సమీక్షించారు. 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు బార్లు, పబ్బులు, హోటళ్లు, రిసార్టుల  యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, హెచ్చరికలు జారీ చేయనున్నారు.

 పోస్టర్లు విడుదల: 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడం నేరమని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్న నినాదాలతో రూపొందించిన పోస్టర్లను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విడుదల చేశారు. ప్రతి మద్య విక్రయ కేంద్రం, బార్ల వద్ద వీటిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రేడియోలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement