
సాక్షి, కర్నూలు(అర్బన్)/టౌన్: ఉద్యోగాల విప్లవం మొదలైంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని 879 గ్రామ సచివాలయాల్లో 8,110 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే 300 వార్డు సచివాలయాల్లో దాదాపు మూడు వేల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 26వ తేదీ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని మొత్తం 909 గ్రామ పంచాయతీల్లో జనాభాను పరిగణనలోకి తీసుకుని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను అధికారులు నిర్ధారించారు. వార్డు సచివాలయాల విషయంలోనూ ఇదే పద్ధతి పాటించారు.ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 27 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
సెప్టెంబర్ ఒకటో తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సంక్షేమ పథకాల అమల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు వాటిని పారదర్శకంగా అర్హులకు అందించేందుకు గ్రామ సచివాలయాల్లో 13 రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 879 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా ఇంకా రెండు లేక మూడు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపామని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు.
300 వార్డు సచివాలయాలు
జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం 300 వార్డు సచివాలయాలను ఖరారు చేసింది. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించనున్నారు. ఈ లెక్కన దాదాపు మూడు వేల మంది ఉద్యోగులను తీసుకుంటారు. వార్డు కార్యదర్శి (సాధారణ పరిపాలన శాఖ), మౌలిక వసతుల కార్యదర్శి (గ్రేడ్–2 ), శానిటేషన్ కార్యదర్శి (గ్రేడ్–2 ), విద్యా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి, సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్–2), ఆరోగ్య కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, మహిళా కార్యదర్శి పోస్టులకు ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment