సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలుపుకోవాలన్న తాపత్రయంతో ఉన్న అధికార పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల మనసు మార్చి తమవైపు ఎలాగూ తిప్పుకోలేమనుకున్న వారు అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 1,33,898 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. మార్పు చేర్పుల్లో 73,121 మంది ఓట్లను తొలగించారు. ఓట్లు కోల్పోయిన వారిలో దాదాపు 40 వేల మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 12 వేలకుపైగా ఓటర్లను తొలగించారని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 5 వేల ఓట్ల వరకు తొలగించినట్లు సమాచారం. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే నోరు మెదిపేందుకు నిరాకరిస్తున్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను ప్రశ్నించగా విచారణ జరుపుతామని మాత్రమే సమాధానమిస్తున్నారు. ఒంగోలు శివారులోని కొప్పోలులో 35 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లు తొలగించారు. వీరు అదే గ్రామంలో ఏళ్ల తరబడి ఉంటూ గతంలో కూడా ఓట్లు వేసిన వారే. అయితే వీరి ఓట్లను కూడా తొలగించడంతో స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించారు.
దీనిపై వైఎస్సార్ సీపీ నాయకుడు రత్తయ్య మాట్లాడుతూ ఓట్ల తొలగింపుపై అధికారులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ మెజారిటీని తగ్గించేందుకే ఆ పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఓటు రాజకీయం
Published Thu, Feb 6 2014 5:53 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement