
'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం'
హైదరాబాద్: పంట రుణాల వసూలు చర్యలు నిలిపేయలేమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బ్యాంకర్లు తేల్చిచెప్పారు. రైతులకు నోటీసులు, బంగారం వేలంపాటలను ఆపలేమని స్పష్టం చేశారు. పంటల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రుణమాఫీ ఏ సంవత్సరం నుంచి వర్తిస్తుందో చెప్పలేదని అన్నారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబుతో బ్యాంకర్లు సమావేశమయ్యారు. రుణమాఫీపై విస్తృతంగా చర్చించారు. సర్కారు తకరారు ధోరణిని ఈ సమావేశంలో బ్యాంకర్లు ప్రస్తావించారు.
రైతులకు నోటీసులు జారీ, బంగారం వేలంపాటలను ఆపమని కోరామని, అది సాధ్యంకాదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీపై స్పష్టత ఇస్తేనే నోటీసులు ఆపుతామన్నారని వెల్లడించారు. ఈ నెల 22 తరువాత రుణమాఫీపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీకి అంగీకరించడంలేదని వాపోయారు. కాని హామీని అమలుచేస్తామని చెప్పారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి కూడా న్యాయం చేయాలనే అలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.