చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన ఇతని పేరు గోస్కుల కృష్ణ. మూడేళ్ల క్రితం వరకు రాజాలా బతికాడు. ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు.
చిట్యాల, న్యూస్‌లైన్ : చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన ఇతని పేరు గోస్కుల కృష్ణ. మూడేళ్ల క్రితం వరకు రాజాలా బతికాడు. ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు. చీకూచింత లేని కుటుంబం. ఉన్నంతలో సంతోషంగా జీవించేవారు. వారి ఆనందాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. మాయదారి రోగం ముసుగులో వచ్చి కృష్ణ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ రోజు కృష్ణ ఆటో నడుపుతుండగా ఉన్నట్టుండి ఎడమకాలు స్పర్శ కోల్పోయింది.
ఆస్పత్రికి వెళితే డబ్బులు ఖర్చయ్యాయి తప్పితే రోగం నయం కాలేదు. ఖర్చుల కోసం జీవనాధారమైన ఆటోను అమ్ముకున్నాడు. అవీ సరిపోకపోతే మరో లక్ష రూపాయలు అప్పు చేశాడు. అయినా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. చివరికి ఆ కాలు ఉంటే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు సూచించడంతో 2010లో ఎంజీఎంలో ఆపరేషన్ చేసి మోకాలు వరకు తొలగించారు. దీంతో కృష్ణ వికలాంగుడయ్యాడు. సదరం క్యాంపులో అతని వికలత్వాన్ని ధ్రువీకరించిన వైద్యులు 86శాతం వికలాంగుడని సర్టిఫికెట్ ఇచ్చారు.
చికిత్స కోసం జీవనాధారమైన ఆటోను అమ్ముకోవడం.. కాలు కోల్పోయి వికలాంగుడిగా మారడంతో కృష్ణ జీవితం కకావికలమైంది. బతుకు దుర్భరమైంది. కనీసం పింఛన్ వస్తే కొంతైనా ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో మూడేళ్ల నుంచి అధికారుల చుట్టూ విసుగులేకుండా తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు గ్రీవెన్స్‌సెల్‌లో 20సార్లు, ఎంపీడీఓకు 30సార్లు వినతిపత్రాలు అందించాడు.
అయినా మనసు కరగని అధికారులు వాటిని చెత్తబుట్టలో పడేస్తున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు పిల్లలను మొగుళ్లపల్లిలోని అత్తవారింటికి పంపించానని, అక్కడే వారు చదువుకుంటున్నారని కృష్ణ తెలిపారు. తన కష్టాలను అర్థం చేసుకుని కలెక్టర్ తనకు ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కన్నీటితో వేడుకుంటున్నాడు.