ఆ గెజిట్ రీషెడ్యూల్ కోసమేనా!
ప్రొద్దుటూరు: వరదలు వచ్చి 8 నెలలైంది. ప్రస్తుతం వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరద నష్టంపై గెజిట్ విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది తుపాన్ ప్రభావం కారణంగా జరిగిన నష్టంపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
జిల్లాకు సంబంధించి 41 మండలాల పరిధిలోని 308 రెవెన్యూ గ్రామాల్లో వరద నష్టం జరిగినట్లు ఈ జాబితాలో పేర్కొన్నారు. గ్రామాల వారిగా వివరాలను గెజిట్‌లో ప్రకటించారు. ఈ ప్రకారం ఈ మండలాలను వరద ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పంట రుణాల రీషెడ్యూల్ కోసమే ప్రభుత్వం ఈ గెజిట్‌ను తయారు చేసిందనే చర్చ జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో పాలిన్ తుపాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ నష్టాన్ని ప్రకటించలేదు. అక్టోబర్‌లో వరదలు వచ్చినా ఇంత కాలం దీని ఊసేలేదు.
కాగా అక్టోబర్ 8 నుంచి 27వ తేదీ వరకు పాలిన్ తుపాన్ ప్రభావం కారణంగా జిల్లాలో ప్రాణనష్టం, పశుసంపద నష్టం, ఇళ్ల నష్టం, పంట నష్టం, ఉద్యానవన, మత్స్యశాఖ, రోడ్లు మరియు భవనాలు, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర శాఖలకు సంబంధించి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లోని విపత్తు నిర్వహణ మండలి వారు సూచించిన మేరకు జిల్లాలోని 41 మండలాల పరిధిలో ఉన్న 308 రెవెన్యూ గ్రామాల్లో ఈ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 13న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
రీ షెడ్యూల్ కోసమేనా!
పంట రుణాల రీ షెడ్యూల్ కోసమే ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో ప్రకృతి వైపరీత్యాల కింద నష్టం జరిగినట్లు గెజిట్‌ను ప్రచురించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం చేసినట్టే చేసి సాధ్యాసాధ్యాల కోసం కోటయ్య కమిటీని నియమించారు. కొన్ని షరతులకు బ్యాంకర్లు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఈ అంశంపై శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది.
మరో వైపు గడువు మీరిపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 661 మండలాలకుగాను 113 మండలాల్లో కరువు, 462 మండలాల్లో తుపాన్ ప్రభావానికి గురయ్యాయని ప్రకటించారు. కరువు తుపానులు వచ్చిన నేపథ్యంలో పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని ఆయన కోరారు. దీనిని బట్టి ప్రభుత్వం వ్యూహం ప్రకారం గెజిట్‌ను విడుదల చేయించినట్లు తెలుస్తోంది.