హైవే పక్కన రిసార్ట్స్
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం
స్థల పరిశీలన చేసిన ముఖ్యకార్యదర్శి
నక్కపల్లి: జాతీయ రహదారి పక్కన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌కె ప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి నక్కపల్లిమండలంలోని న్యాయంపూడి, ఉద్దండపురం ప్రాంతాల్లో రిసార్ట్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విమానాల్లో ప్రయాణించేవారి కోసం ఎక్కడికక్కడ రిసార్ట్స్ ఉన్నాయని, జాతీయరహదారిపై రాకపోకలు సాగించేవారి కోసం ఎటువంటి రిసార్ట్స్ సదుపాయాలు లేవన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయరహదారి వెంబడి ప్రతి 70 కిలోమీటర్లకు ఒక రిసార్ట్స్ నిర్మించాలని నిర్ణియించిందన్నారు. వీటిల్లో ఫుడ్‌కోర్టు, మెడికల్ షాపు, పిల్లలు ఆడుకునేందుకు స్పోర్ట్స్ సెంటర్ నిర్మిస్తామన్నారు. ఒక్కోదానికి ఐదు ఎకరాల స్థలం అవసరమని, ప్రభుత్వ స్థలాలు ఉంటే నిర్మిస్తామని లేకుంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలుచేస్తామన్నారు.ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా ప్రస్తుతం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పున్నమి తరహాలో రిసార్ట్స్ నిర్మిస్తామన్నారు. ఆయన వెంట పర్యాటకశాక డీఈ రామకృష్ణారావు, ఏఈ రామారావు, తహశీల్దార్ సుందరరావు, ఆర్‌ఐ అశోక్ ఉన్నారు.