ఓం నమఃశివాయః
- దుర్గమ్మ సన్నిధిలో అక్షర దీవెనకు విశేష స్పందన
- వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
- చిన్నారులను ఆశీర్వదించిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
- పలక, బలపం, స్కూల్ బ్యాగ్, కుంకుమ అందజేత
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఉపదేశించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్షర దీవెన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
దేవస్థాన ప్రాంగణంలోని భవానీ దీక్షా మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామీజీకి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ఈవో త్రినాథరావు సాదర స్వాగతం పలికారు. స్వామీజీ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ఆశీర్వచన మండపంలో దేవస్థానం తరఫున అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఈవో అందజేశారు.
అనంతరం భవానీ దీక్షా మండపానికి చేరుకున్న స్వామీజీ సరస్వతీ దేవికి పూజ చేసి పలువురు చిన్నారుల చేత ఓం నమఃశివాయః అని రాయించి ఆశీర్వదించారు. అక్షరాభ్యాసం చేసిన చిన్నారులకు దేవస్థానం తరఫున పలక, బలపం, స్కూలు బ్యాగు, అమ్మవారి పాకెట్ క్యాలెండర్, కుంకుమలను అందజేశారు.
తొలుత భవానీ దీక్షా పీఠంలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి చిత్రపటం వద్ద దేవస్థాన అర్చకులు విఘ్నేశ్వరపూజ, సరస్వతి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు శీఘ్రదర్శనం క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఏఈవోలు సాయిప్రసాద్, లక్ష్మీకాంతం, ఫెస్టివల్ విభాగం జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసన్న, ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్, అర్చకులు, పండితులు పాల్గొన్నారు.
దేవాలయాల్లో పనిచేస్తున్న ఇతర మతస్తులను తొలగించాలి
అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఇతర మతస్తులను విధుల నుంచి తొలగించాలని, దేవాలయ పరిసరాల్లో అన్యమత ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమలలో అన్యమత సంస్థకు భూమి కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీలను పెంచడం వల్ల తీర్థయాత్రలు చేసే వారికి భారమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది యమునా నది పుష్కరాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లే భక్తులపై భారం పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాజకీయాల్లో పదవులు రానివారికి దేవాలయ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు.