పదవీ గండం!
- రుణమాయ ఎఫెక్ట్
- రుణ బకాయిలు చెల్లించని పీఏసీఎస్ అధ్యక్షులు, డెరైక్టర్లు
- 80 శాతం మంది డిఫాల్టర్లుగా మారే ప్రమాదం
- ఒక్కో సొసైటీలో 50శాతం డిఫాల్టర్లుంటే పాలకవర్గం రద్దు
- కేడీసీసీ బ్యాంకు పాలకవర్గంపైనా ప్రభావం
మచిలీపట్నం/నూజివీడు :టీడీపీ మోసపూరిత హామీల వల్ల ఇప్పటివరకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు మాత్రమే నష్టపోయినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, వారి కన్నా తామే ఎక్కువగా మోసపోయామని, తద్వారా పరువు కూడా పోతుందని పలువురు పీఏసీఎస్ అధ్యక్షులు, సభ్యులు మదనపడుతున్నారు. తమ పదవులు ఎప్పుడు కోల్పోతామో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళనకు గురవుతున్నారు. వీరిపై ఆధారపడిన కేడీసీసీబీ పాలకవర్గ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
అంతా రుణమాయ వల్లే..
సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నీ రద్దు చేస్తానని, ఎవరూ చెల్లించవద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలోని పీఏసీఎస్‌లలోని రైతులతోపాటు పాలకవర్గ అధ్యక్షులు, సభ్యులు అధిక శాతం మంది వారు తీసుకున్న రుణాలను చెల్లించలేదు. ఈ ఏడాది మార్చి 31లోపు, జూన్ 30వ తేదీ నాటికి రుణాలు రెండు విడతల్లోనూ వాయిదా మీరాయి. వాయిదా మీరిన రుణాలు 90 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంది. లేకపోతే సహకార చట్టం ప్రకారం పాలకవర్గ సభ్యులు, అధ్యక్షులు డిఫాల్టర్లుగా మారతారు. ఒక పీఏసీఎస్‌లో 13 మంది సభ్యులు ఉంటే వారిలో ఏడుగురు డిఫాల్టర్లుగా మారితే సహకార చట్టం బైలా ప్రకారం ఆ పాలకవర్గం రద్దవుతుందని సహకార శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలతో గతంలో నూజివీడు మండలం మీర్జాపురం సొసైటీ పాలకవర్గం రద్దయింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని పస్తుత పాలకవర్గ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
80 శాతం పాలకవర్గాలు రద్దయ్యే ప్రమాదం
జిల్లాలో 425 పీఏసీఎస్‌లు ఉన్నాయి. 2013, ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో పీఏసీఎస్‌లకు నూతన డెరైక్టర్లుగా 5,525 మంది ఎన్నికయ్యారు. జిల్లాలోని ఏడు సొసైటీల్లో వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు అవకాశం లేదు. మిగిలిన 418 పీఏసీఎస్‌ల ద్వారా పంట రుణాలు ఇచ్చారు. ఈ 418 పీఏసీఎస్‌లలో 80 శాతం మంది పాలకవర్గ సభ్యులు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించకపోవటంతో వారంతా డిఫాల్టర్లుగా మారినట్లే. పీఏసీఎస్ అధ్యక్షుల నుంచే కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గంలో 21 మంది సభ్యులు ఉండగా, వారిలో 16 మంది సభ్యులు పీఏసీఎస్‌ల నుంచే ఎన్నికైన వారు జిల్లా డెరైక్టర్లుగా ఎన్నికయ్యారు. ఈ 16 మంది డెరైక్టర్లలో అధికశాతం మందిని డిఫాల్టర్లుగా ప్రకటిస్తే జిల్లా పాలకవర్గం ఎంతమేర కొనసాగుతుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది.
కోర్టుకు వెళ్లేందుకు ప్రత్యర్థుల కసరత్తు!
సొసైటీలోని అధిక శాతం సభ్యులు డిఫాల్టర్లుగా మారినా ఆయా పాలకవర్గాలను ఎలా కొనసాగిస్తారంటూ గతంలో పోటీ చేసి ఓటమిపాలైన కొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సహకార శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కోర్టుకు వెళ్లేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. అయితే, పీఏసీఎస్‌ల పాలకవర్గ సభ్యులు డిఫాల్టర్లుగా మారినా, వారిని సభ్యులుగానే కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తేనే పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంతో పీఏసీఎస్ పాలకవర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.