ఇదేమి రుణ విమోచన?!
♦ రుణ విమోచన పేరిట పత్రాలు
♦ బాకీ కట్టలేదని జప్తు నోటీసులు
♦ పత్రం అందినా...పైసా జమకాలేదని అంటున్న రైతులు
పత్రం సారాంశం...
‘పాదయాత్రలో మీరు పడుతున్న బాధలు చూశా. అందుకే మీ ఇంటి పెద్ద కొడుకుగా మిమ్మల్ని రుణ విముక్తుడ్ని చేయాలని నిర్ణయించా’నంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించి ఆయన పేరుమీదుగా ప్రభుత్వం రుణ విమోచన పత్రాలు జారీ చేశారు.
వాస్తవం...
పత్రంలో సారాంశమైతే బాగానే ఉంది... వాస్తవానికి నేటికీ రైతు ఖాతాలో పైసా జమ కాలేదు. రుణ విమోచన పత్రం పట్టుకుని బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారవుతోంది రైతుల పరిస్థితి. రుణ విమోచనకు బదులు రుణగ్రస్తులను చేస్తున్నాయి. అక్కౌంట్ నంబరు పరిశీలించి బాకీ కట్టలేదంటూ తాజాగా జప్తు నోటీసులు జారీ చేయడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడిపోయారు.
ఒంగోలు: మండలంలోని సర్వేరెడ్డిపాలేనికి చెందిన కప్పనబోయిన తిరుపతిస్వామి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో, యూనియన్ బ్యాంకులో 2007 జూలై 23న మిర్చి, పొగాకు పంటలకు రుణం తీసుకున్నాడు. బాకీ మొత్తం రూ.50 వేలకంటే హెచ్చుగా ఉండడంతో తొలివిడతగా అందులో అయిదోవంతు రుణాన్ని రదు ్దచేస్తున్నట్లు పేర్కొంటూ గత ఏడాది డిసెంబరులో ఆయనకు ప్రభుత్వ అధికారులు రుణవిమోచన పత్రాన్ని అందజేశారు. మిగతా మొత్తానికి బాండ్లను అందజేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో రైతు సంతోషించాడు. యూనియన్ బ్యాంకు అధికారులు తొలి విడత విడుదలైన మొత్తాన్ని ఆయన రుణఖాతాకు జమచేశారు.
సర్వేరెడ్డిపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అతనికి రూ.38,922 బాకీ ఉంది. దానికి తొలి విడతగా మంజూరైన మొత్తం రూ.7,784 జమ చేయాల్సి ఉంది. దీనిపై తాను తమ సొసైటీ కార్యదర్శి బ్రహ్మయ్యను కలిశానని, సరైన సమాధానం ఇవ్వడంలేదని రైతు వాపోయాడు. జమ చేయాల్సిన మొత్తాన్ని జమచేసి మిగతా మొత్తం వివరాలు అందజేస్తే ఎలాగోలా చెల్లిస్తానని తెలిపానని, ఇంతవరకు సమాధానం లేదని వాపోయాడు. చివరకు రుణం మొత్తం జమచేసి బ్యాంకు పుస్తకం ఇస్తానంటే కార్యదర్శికి రూ.500 ఇచ్చానని, ఇంతవరకు పుస్తకం ఇవ్వలేదని ఆరోపించారు.
ఇదిలా ఉండగానే తనకు పీడీసీసీ బ్యాంకు నుంచి తన ఆస్తులను వేలం వేయనున్నట్లు జప్తు నోటీసు వచ్చిందని లబోదిమంటున్నారు. దీనిపై తాను పీడీసీసీ బ్యాంకు టౌన్ బ్యాంకు మేనేజర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నానని, ఆయన అలా ఎందుకు జరిగిందో విచారిస్తాననడమే గాని పరిష్కారం సూచించలేకపోయారన్నాడు. జప్తు నోటీసు జారీచేయడం వల్ల అయిన ఖర్చులు, అది జారీ కావడం వల్ల సమాజంలో తనకున్న పరువు పోయిందని ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి వాపోయాడు. తనకు ఇచ్చిన రుణవిమోచన పత్రాన్ని, తనకు జారీ అయిన జప్తు నోటీసును చూపించాడు.
తాను ఇప్పటికి కూడా బాకీ రద్దు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే తన బాకీకి ప్రభుత్వం విడుదలచేసిన మొత్తం ఎందుకు జమ కాలేదో ఉన్నతాధికారులు విచారించాలన్నారు. తనపై వివక్ష తోనే ఈ వ్యవహారం జరిగిందని, సంబంధిత సొసైటీ కార్యదర్శిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధ్యక్షుడు ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగా తాను తన గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మీడియాను ఆశ్రయించినట్లు రైతు తిరుపతిస్వామి పేర్కొన్నారు. 2015 జూన్ 26న జప్తు నోటీసు జారీచేశారని, రూ.48,890 చెల్లించని పక్షంలో ఈ నెల 31వ తేదీ వేలం వేస్తామని నోటీసులో పేర్కొన్నారు. మరి...రుణం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఒక వైపు ప్రభుత్వం అంటుంటే మరో వైపు బ్యాంకులు వేలం నోటీసులు జారీచేసి జప్తుచేస్తామని హెచ్చరికతో విస్మయం చెందుతున్నారు.