రుణమాఫీ కాలయాపన తగదు
కర్నూలు(రాజ్‌విహార్): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఓబులేసు డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి మద్దతుగా వచ్చిన రైతులు ప్రధాన గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు, రైతులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
200 మందిని అరెస్టు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకు ముందు ఓబులేసు మాట్లాడుతూ అధికార దాహంతోనే చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. రైతుల ఇక్కట్ల దృష్ట్యా రుణమాఫీ హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. చేనేతలు, డ్వాక్రా మహిళల రుణాలను కూడా రద్దు చేయాలన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య మాట్లాడుతూ దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల రుణమాఫీని పక్కనపెట్టి.. స్మార్ట్‌సిటీ, కొత్త రాజధాని పేర్లతో సింగపూర్ పర్యటనలు చేసి కార్పొరేట్ కంపెనీలకు చంద్రబాబు దాసోహమయ్యారన్నారు. జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వర్షపాతం తక్కువగా ఉన్న మండలాలన్నింటినీ కరువు జాబితాలో చేర్చాలని కోరారు. కూలీలకు ఉపాధి అవకాశాలు మోరుగుపర్చి జిల్లాలో వలసలు నివారించాలని డిమాండ్ చేశారు. ముట్టడిలో పార్టీ జిలా కార్యదర్శి అజయ్‌బాబు, మనోహర్ మాణిక్యం, ఎస్‌ఎన్ రసూల్, బి.జి.మాదన్న, రంగనాయుడు పాల్గొన్నారు.