ప్రభుత్వపరంగా రుణాలు అందకే మహిళలు, రైతులు కాల్‌మనీ వ్యాపారులు బారిన పడుతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఒక్కరికీ డ్వాక్రా రుణాలు అందేవని మహిళలు చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు డ్వాక్వా, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో రుణాలు చెల్లించలేదు. అయితే చంద్రబాబు మాట నిలబెట్టుకోకుండా మోసగించటంతో మహిళలు రుణాల చెల్లింపుల కోసం కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. రైతులదీ ఇదే దీనస్థితి. కాగా కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను తప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా పన్నాగాలు పన్నుతోందని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. - వన్‌టౌన్/గాంధీనగర్/కంచికచర్ల/వీరులపాడు
మాఫీ విషయంలో చంద్రబాబు మోసం చేశాడు
చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలు తీసుకున్న ఎవరినీ రుణాలు చెల్లించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలే ప్రచారం చేశారు. దాంతో డ్వాక్రా సంఘాలకు చెందిన మా మహిళలందరూ రుణాలు చెల్లించలేదు. డ్వాక్రా రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేయడంతో బ్యాంక్‌లు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదు.
- పిళ్లా కుమారి
పొదుపు కూడా నిలిచిపోయింది
డ్వాక్రా సంఘాలన్నీ గతంలో బ్యాంక్‌లకు చక్కగా పొదుపు మొత్తాన్ని చెల్లింపులు చేసేవి. కానీ గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తాను గెలిస్తే అన్ని రుణాలు మాఫీ చేస్తానని హామీలివ్వడంతో రుణాలు చెల్లింపే కాకుం డా పొదుపు చేయడం కూడా మహిళలు మానేశారు. పొదుపు లేకపోవడం, రుణాలు లభించక మహిళలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. - బి.శాలమ్మ
అధిక వడ్డీలకు తెచ్చుకుంటున్నాం
ప్రభుత్వ సంస్థల నుంచి సరైన రుణాలు అందకే అధిక వడ్డీలకు తెచ్చుకోవాల్సి వస్తోం ది. గతంలో డ్వాక్రా రుణాలు చక్కగా కట్టేసేవాళ్లం. అప్పు తీరిపోగానే వెంటనే అప్పు ఇచ్చేవారు. ఇప్పుడు చెల్లింపులు నిలిచి పోవడంతో బ్యాంకులు వెంటనే రుణాలు ఇవ్వడం లేదు. ఇంట్లో అవసరాలకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.
- కొరగంజి సాయి
కాల్‌మనీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలి
ఇంట్లో అవసరాలకు అప్పు చేసిన మహిళలపై దారుణంగా వ్యవహరించడం అమానుషం. అటువంటి వ్యాపారులను కఠినంగా శిక్షించాలి. ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహిళలను లైంగికంగా వేధించడంతో పాటుగా వారిని వీడియోలు తీయడం వంటివి చేయడం ప్రభుత్వం చేతకానితనం వలనే చోటు చేసుకుంటున్నాయి.
- విజ్జి లక్ష్మి
చంద్రబాబు పాలనలో అన్నీ సమస్యలే
చంద్రబాబునాయుడు పాలనలో ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. ఇళ్లు గడవటం చాలా ఇబ్బందిగా మారింది. వచ్చే ఆదాయాలు చాలక అందరూ అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. దాంతో కాల్‌మనీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నూటికి పది రూపాయలు కూడా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇదంతా ధరల పెరుగుదల వల్లే జరుగుతున్నాయి. - కె.సూరీడు
వడ్డీ కూడా మాఫీ కాలేదు
నాకు ఐదెకరాల భూమి జుజ్జూరు గ్రామంలో ఉంది. ఇండియన్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ కింద ఈ ఏడాది రూ.30 వేల జమ చేశారు. కానీ డబ్బులు రుణంపై వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోలేదు.
- పసుపులేటి సాయిబాబు, వీరులపాడు
వడ్డీలు కట్టలేక విలవిల
నాకు పెద్దాపురం గ్రామంలో 4 ఎకరాల భూమి ఉంది. సాగు కోసం అల్లూరు గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి లక్ష రుణం తీసుకున్నాను. కాని ప్రభుత్వ రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. బ్యాంక్‌లో ఈ ఏడాది కొత్త రుణం ఇవ్వలేదు. సాగుకు డబ్బులు లేకపోవడంతో ప్రెవేటు వ్యక్తుల వద్ద వడ్డీకి తీసుకుని పంట సాగు చేశా. పంట సరిగా పండక అప్పులే మిగిలాయి. వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నాం.
- కోటేరు సత్యనారాయణరెడ్డి, వీరులపాడు
రుణ మాఫీ కేవలం ఒక విడతే రద్దయింది
బ్యాంకుల నుంచి రుణం తీసుకుని మొక్కజొన్న 5 ఎకరాలు, వరి 5, దొండ 5, అరటి 2 ఎకరాలు, అల్లం ఒక ఎకరం పంట సాగు చేసా. కానీ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు కేవలం మొదటి విడతలో రూ.30 వేలు మాత్రమే రదయ్యాయి. దీంతో ఇతర వ్యక్తుల నుంచి అప్పు చేసి పంటలను సాగు చేశా. అప్పుతీరే మార్గం కనిపించటంలేదు.
- అబ్బూరి వెంకట శివనాగమల్లేశ్వరరావు, రైతు,
కొత్తపేట(కంచికచర్ల)
ఇతరుల నుంచి అప్పు చేసి పంటలు సాగు చేశా..
బ్యాంకు రుణాలతోపాటు ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులతో 40 ఎకరాలు పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము తదితర పంటలు సాగు చేసా. కానీ ప్రభుత్వం రుణ మాఫీ మొదటి విడత మాత్రమే రద్దు చేశారు. మూడేళ్ల నుంచి వాతావరణం అనుకూలించకపోవటంతో పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. అప్పులు తీరలేదు. బంధువులు, ఇతరుల నుంచి తీసుకున్న అప్పులు వడ్డీతో సహా పెరిగిపోయాయి.
- పొదిలి హనుమయ్య రైతు, కొత్తపేట(కంచికచర్ల)
తొలి ముద్దాయి చంద్రబాబే
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో సీఎం చంద్రబాబు తొలిముద్దాయిగా, పోలీసులు, వ్యాపారులను రెండు, మూడవ ముద్దాయిలుగా చేర్చాలి. పటమటలో జరిగిన ఘటనలో నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని మహిళలను వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. ఘటన దేశమంతా ప్రచారం కావడంతో ఆ పార్టీ నాయకులు కేసును పక్కదారి పట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తప్పించేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. - ఆర్.గంగాభవానీ, రాష్ర్ట అధ్యక్షురాలు, పీఓడబ్ల్యూ
పెద్దన్న అంటే ఇలానా?
ఎన్నికల ముందు చంద్రబాబు మహిళలకు పెద్దన్నగా ఉంటానని వాగ్దానం చేశారు. మహిళా సాధికారతే ధ్యేయమని, మహిళలను ఉద్ధరిస్తానని గొప్ప ప్రకటనలు చేశారు. మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడడం, మానప్రాణాలు తీయడం ఉద్ధరణ అవుతుందా? సాధికారత అంటే మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టడమా? వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సెక్స్ రాకెట్, కాల్‌మనీ వ్యాపారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి.
- కె.శ్రీదేవి, నగర కార్యదర్శి, ఐద్వా
అసలు ముద్దాయి ప్రభుత్వమే
చంద్రబాబు మహిళా వ్యతిరేకి. దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి ఉల్లంఘించారు. కాల్ మనీ సెక్స్‌రాకెట్‌లోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం వారిని తప్పించాలని చూస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా చిన్నవ్యాపారులపై దాడి చేయిస్తోంది. మహిళల మానప్రాణాలు దోచుకున్న వారిని రక్షించేందుకు కేసును నీరు గారుస్తున్నారు. అసలు ముద్దాయి ప్రభుత్వమే.
- ఎన్.విష్ణు, పీఓడబ్ల్యూ, రాష్ర్ట కార్యదర్శి
సెక్స్ రాకెట్‌లో దోషులను తప్పిస్తున్నారు
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పేర్లు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. కొందరు ఉద్యోగులు దీని వెనుక ఉన్నారు. వారందరికీ అధికార పార్టీ అండదండలున్నాయి. ఇరకాటంలో పడిన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు దాడులు నిర్వహించి డ్వాక్రా మహిళలకు కొద్ది మొత్తాల్లో వడ్డీకి డబ్బులిచ్చిన వారిపై కేసులు పెడుతోంది. దోషులను కఠినంగా శిక్షించాలి.
- పంచదార్ల దుర్గాంబ, మహిళా సమాఖ్య, నగర కార్యదర్శి
ప్రభుత్వం రుణాలు మాఫీ చేయనందువల్లే..
ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా, చేనేత రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అధికారం చేపట్టాక విస్మరించారు. ఫలితంగా వడ్డీలు, అపరాధ వడ్డీలు పెరిగిపోయాయి. అవి చెల్లించలేని మహిళలు, రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే ఆసరాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాల్‌మనీ పేరుతో వారిని రోడ్డుకీడుస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. - కె.సరోజ, ఐద్వా నగర అధ్యక్షురాలు
రెచ్చిపోతున్న కాల్‌యముళ్లు
Published Fri, Dec 18 2015 12:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement