హోంగార్డుల వసూళ్ల దందా | Revenue am I danda | Sakshi
Sakshi News home page

హోంగార్డుల వసూళ్ల దందా

Published Sun, Oct 12 2014 11:53 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

Revenue am I danda

సాక్షి, గుంటూరు: జిల్లాలోని పలువురు హోంగార్డులు వసూల్ రాజాలుగా మారుతున్నారు. కొందరు పోలీస్ అధికారులు వీరి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బందికి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరిని గౌరవ వేతనంపై నియమిస్తోంది. కానీ కొందరు పోలీస్ అధికారులు సొంత పనులు, సొమ్ము వసూళ్లకు వీరిని ఉపయోగించుకుంటుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోంది.

  కానిస్టేబుళ్లయితే ఇళ్లలో పనిచేయడానికి ముందుకురారని, వసూలు చేసిన సొమ్ములో అధికం శాతం నొక్కేస్తారని భావిస్తున్న కొందరు అధికారులు హోంగార్డులను చేరదీస్తున్నారు. హోంగార్డులు స్థానికులు కావడంతో నిందితులు, బాధితులతో నేరుగా మాట్లాడి అధికారి జేబులు నింపేందుకు ఉపయోగపడుతున్నారు. దీంతో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకూ ఎవరికైనా సంబంధిత అధికారితో పని ఉంటే ముందుగా హోంగార్డులను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది.

  అధికారుల తరఫున వసూళ్ల దందా నడుపుతున్న హోంగార్డులు ఎస్సైలను సైతం లెక్కచేయడంలేదు. రాత్రిపూట సదరు పోలీస్ అధికారిని ఇంటి వద్ద దింపేశాక హోంగార్డులు రోడ్లపై బెదిరింపులకు దిగుతున్నారు. వచ్చేపోయే వాహనాలను ఆపి తనిఖీల పేరిట, హోటళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే పొద్దున్నే తమ అధికారికి లేనిపోనివి చెప్పి స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

  జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండ, గురజాల, మాచర్ల, తెనాలి వంటి ప్రాంతాలతోపాటు పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో లాటరీ, క్రికెట్ బెట్టింగ్, పేకాట, వ్యభిచారం, బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారు ఈ హోంగార్డులతో నెలవారీ మామూళ్లు మాట్లాడుకుని తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగితే అక్రమార్కులను అప్రమత్తం చేసి స్థావరాలు మార్పించడం కూడా వీరే చేస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి సొంతంగా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారు.

  తమ చేతికి మట్టి అంటకుండా నెలనెలా లక్షలాది రూపాయలు వసూలు చేసి పెడుతున్న హోంగార్డులను కొందరు అధికారులు బదిలీ అయ్యూక కూడా వదల్లేకపోతున్నారు. తామెక్కడికి వెళితే వీరినీ అక్కడికే బదిలీ చేయిస్తున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే తమకు అత్యంత సన్నిహితంగా ఉండే మరో పోలీస్ అధికారి వద్దకు వీరిని చేర్చి జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నారు. కొందరు హోంగార్డులు ఏకంగా పోలీస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి దీపావళి మందుగుండ, క్వారీ పేలుళ్ల వంటివాటికి అనుమతులు ఇచ్చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. హోంగార్డుల దందాను అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోకపోతే మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉంది.

 పోలీస్ విధులకు మాత్రమే
 వినియోగించుకోవాలి: ఆర్‌ఐ ప్రేమ్‌కుమార్
 దీనిపై హోంగార్డుల ఆర్‌ఐ ప్రేమ్‌కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా హోంగార్డులను పగలైనా, రాత్రైనా 8 గం టలు మాత్రమే విధుల్లో ఉపయోగించుకోవాలని చెప్పా రు. అయితే కొంతమంది ఎస్సైలు, సీఐలు వారిని తమ సొంత పనులకు, వసూళ్లకు కూడా ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయనీ, తన అనుమతి లేకు ండా హోంగార్డులను ఇష్టంవచ్చినట్లు అధికారులు ఎక్కడికి బదిలీ అయితే అక్కడకు మార్చుకోవడానికి వీలులేదనీ పేర్కొన్నారు, ఇది చట్ట విరుధ్ధమనీ, ఎవ రైనా పోలీసు అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిై పె ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. హోంగార్డులు కొందరు యూనిఫాం ధరించకుండా మఫ్టీల్లో తిరుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసకుంటామన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement