కళ్లల్లో కారం చల్లి రూ 2.77 లక్షలు దోపిడీ
- నల్లకుంట ఠాణా పరిధిలో ఘటన
నల్లకుంట: బైక్‌పై వెళ్తున్న కలెక్షన్‌బాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తమ బైక్‌లతో ఢీకొట్టారు... కళ్లల్లో కారం చల్లి అతడి చేతిలో ఉన్న రూ. 2.77 లక్షల నగదు బ్యాగ్‌ను లాక్కొని ఉడాయించారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తూర్పు మండలం అదనపు డీసీపీ ఎల్‌టీ. చంద్రశేఖర్ తెలిపిన వివరాలు... సీతాఫల్‌మండి మైలార్‌గడ్డ నివాసి చిప్ప రాజేందర్(38) ట్రూప్ బజార్‌లోని మారుతి ఎలక్ట్రికల్స్‌లో సేల్స్‌మెన్/ కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 25, 26 తేదీల్లో వసూలు చేసిన డబ్బు రూ 2.77 లక్షలను కార్యాలయంలో అప్పగించకుండా తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు.
గురువారం తన వద్ద ఉన్న డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని సుల్తాన్ బజార్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జమ చేసేందుకు ఉదయం 11.30కి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. సరిగ్గా 11.45కి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ సమీపంలోని లలితానగర్ గండిమైసమ్మ ఆలయం వీధి వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు రాజేందర్ బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిపోయిన రాజేందర్ చేతిలోని క్యాష్‌బ్యాగ్‌ను ఓ వ్యక్తి లాక్కోవడానికి ప్రయత్నించగా వదలలేదు. దీంతో వారు రాజేందర్ కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కుని పారిపోయారు.
సమీపంలో ఉన్న ఓ మహిళతో పాటు అదే వీధిలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న కొందరు యువకులు అడ్డుకునేందుకు యత్నించగా వారిని కూడా దుండగులు బెదిరించి పారిపోయారు. వెంటనే బాధితుడు నల్లకుంట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారం తెలిసి తూర్పుమండలం అదనపు డీసీపీ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లింబారెడ్డి, కోటిరెడ్డి, సీసీఎస్ డీసీపీ బాలరాజు నల్లకుంట స్టేషన్‌కు చేరుకున్నారు.
బాధితుడు రాజేందర్‌ను తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మైలార్‌గడ్డలోని అతని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిసింది.
ఘటనపై అనుమానాలు...
బాధితుడు రాజేందర్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది అంతుబట్టడంలేదు. ఈ దోపిడీకి పాల్పడిన ముఠాకు రాజేందర్‌కు ఏమైనా సంబంధాలున్నాయా? లేక బిగ్ బజార్‌లో మాదిరిగానే ఇందులో కూడా తెలిసిన వారి హస్తం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఆరు రోజుల క్రితం సుల్తాన్‌బజార్‌లో నలుగురు దుండగులు రెండు పల్సర్ బైక్‌లపై వచ్చి రూ. 50 లక్షలు దోచుకెళ్లిన సంఘటన.., ఇప్పుడు నల్లకుంటలో జరిగిన దోపిడీ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ఈ దోపిడీ కూడా అదే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.