
ఇంటికిపో, బయటకు పో అంటూ...
విజయవాడ : జిల్లా కలెక్టర్ బాబు.ఎ వ్యవహార శైలిపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. శనివారం రాత్రి గాంధీనగర్ ఎన్జీవో అసోసియేషన్ హాలులో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ వేధింపులపై పలువురు నాయకులు, అధికారులు మండిపడ్డారు. కలెక్టర్ తమను కట్టు బానిసలుగా చూస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ ప్రతి అధికారిని యూజ్‌లెస్, వేస్ట్‌ఫెలో, ఇంటికిపో, బయటకు పో అంటూ పదేపదే దుర్భాషలాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ తన తీరు మార్చుకోకపోతే సహకరించేది లేదని సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులను సైతం అటెండర్‌ల కంటే హీనంగా కలెక్టర్ తిడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
పొద్దస్తమానం ల్యాప్‌ట్యాబ్, ల్యాప్‌టాబ్ అంటూ తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని వారు పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడి ప్రజలు తమపై తిరగబడుతున్నారని చెప్పారు. ఈ-పోస్ విధానం అట్టర్ ఫాప్ల్ అయిందని అన్నారు. సాయంత్రం 6 గంటల తరువాత వీడియో కాన్ఫరెన్స్‌లు, సెల్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కాకూడదని తీర్మానించారు. ఈ సమావేశానికి ఎన్జీవో అసోసియేషన్ నాయకులు హాజరై తమ మద్దతు ప్రకటించారు.