లంచగొండుల భరతం పడుతున్న ప్రజలు
వరుసగా ఏసీబీకి చిక్కుతున్న రెవెన్యూ అధికారులు
ఉదయగిరి/కలిగిరి : విసిగి వేసారిన కొందరు బాధితులు రాబడే లక్ష్యంగా పనిచేస్తున్న రెవెన్యూ అవినీతి పరుల భరతం పడున్నారు. సామాన్యులు కార్యాలయం చుట్టూ తిరిగి అడిగినంత ఇచ్చుకోలేక, పనులు కాక సరిపెట్టుకుంటుండగా, ఒకరిద్దరు మాత్రం ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వింజమూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లో కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది లంచగొండి తనం భరించలేక ఏసీబీని ఆశ్రయించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
కలిగిరిలో ఏసీబీ అధికారులు సోమవారం జరిపిన దాడుల్లో పెద్దకొండూరు వీఆర్వో పర్రే బాబురావు పట్టుబడటంతో రెవెన్యూ శాఖలో కలవరం మొదలైంది. మండలంలో గతంలో మూడుసార్లు జరిగిన ఏసీబీ దాడుల్లో రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. 2008లో వీఆర్వో పెంచలయ్య పాసుపుస్తకం కోసం లంచం తీసుకుంటుండగా ఏసీవీ డీఎస్పీ చౌదరికి పట్టుబడ్డాడు. 2012 జనవరి 19వ తేదీన తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శ్యామలమ్మ పాసుపుస్తకం మంజూరు చేయడానికి లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావుకు పట్టుబడ్డారు.
అప్పట్లో ఆమెతో పాటు అటెండర్ శ్రీనివాసులుపై కూడా కేసు నమోదు చేశారు. 2013 మే 17వ తేదీన తహశీల్దార్ కార్యాలయంలో పొలం హద్దులు చూపడానికి రూ.5 వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ నాగరాజు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావుకు పట్టుబడ్డారు. వరుసగా రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ చిక్కడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ మండలంలో అవినీతి తారాస్థాయిలో జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది వింజమూరు మండలం నందిగుంట వీఆర్వో శేషయ్య ఏసీబీకి చిక్కిన విషయం విదితమే.
అంతకు ముందు ఏడాది తహశీల్దారు రెహమాన్, సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం కార్యాలయంలోనే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా అందులో భాగస్వామిగా ఉన్న సర్వేయరు, డిప్యూటీ తహశీల్దారు తప్పించుకున్నారు. తమిదపాడుకు చెందిన వీఆర్వో కొండారెడ్డి కూడా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. గతంలో కొండాపురం మండలం గొట్టిగుండాల వీఆర్వో, వరికుంటపాడు మండల ఆర్‌ఐ కూడా ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు.
దళారులదే రాజ్యం
నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాల్లో దళారులదే ఇష్టారాజ్యమైంది. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కొంత మంది దళారులను చేరదీసి ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి వారి ద్వారా లంచం పుచ్చుకుంటున్నారు. ఉదయగిరి తహశీల్దారు కార్యాలయంలో ప్రతి పనికీ లంచాలు గుంజుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఎంతో కాలం నుంచి ఇక్కడ తిష్ట వేసిన ఓ రెవెన్యూ అధికారిణి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో కలిగిరి, వరికుంటపాడుల్లో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారుల సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు ఆయా మండలాల్లో కొంత మంది రెవెన్యూ అధికారుల సహాయంతో అధికార పార్టీ చోటా నేతలు నకిలీ పాస్‌పుస్తకాలు పుట్టిస్తున్నారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. పలు రెవెన్యూ కార్యాలయాల్లో సాయంత్రం 4 గంటల తరువాత దళారులు కార్యాలయం వద్దకు చేరుకుని పనులు చక్కబెట్టుకుంటున్నారు.
ముఖ్యంగా దుత్తలూరు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఓ ఉన్నతాధికారి ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయిస్తూ బహిరంగంగానే లంచాలు పుచ్చుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. ఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
మితిమీరిన రెవెన్యూ అవినీతి
Published Wed, May 20 2015 5:50 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM