‘భూమాయ’పై ఏసీబీ దూకుడు
హెచ్‌ఎండీఏ పరిధిలో 14 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇళ్లపై ఏకకాలంలో దాడులు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని 14 మంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులు, సిబ్బంది ఇళ్లపై గురువారం ఏకకాలంలో దాడులు చేసింది. ప్రధానంగా మియాపూర్ భూదందా కేసులో అరెస్టయిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ ఇళ్లపై దాడులు నిర్వహించి ఏసీబీ ప్రభుత్వ భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల కోసం పెండింగ్‌లో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా వల్లభ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న టీఎన్‌జీవో హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఇళ్లు, కార్యాలయంపై దాడులు నిర్వహించింది. తదుపరి విచారణ కోసం ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
వల్లభ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా ముజీబ్ గురువారం బాధ్యతలు చేపట్టిన కాసేపటికే ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇప్పటివరకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను రెండు రోజుల క్రితం అధికా రులు బదిలీ చేశారు. దీంతో హైదరాబాద్ టీఎన్‌జీఓ అధ్యక్షుడిగా ఉన్న ముజీబ్‌ను ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా ప్రభుత్వం నియమించింది. ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి పాత తేదీలతో ఉన్న స్టాంపు పేపర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
45 మంది అధికారులపై త్వరలో కేసులు
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు, సంబంధిత అధికారుల ఇళ్లలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఇక కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి కుట్రపూరితంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు కేసులు నమోదు చేయనున్నారు. ఈ రకంగా మొత్తం 45 మంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులు, 16 మంది సూపరింటెండెంట్లు, ఆపై స్థాయిలో ఉన్న అధికారులపై విచారణకు సిద్ధమవుతున్నట్టు ఏసీబీలోని కీలక అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన దాడులు, స్వాధీనం చేసుకున్న పత్రాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, దాని ఆధారంగా ఏయే అధికారి ఎంత స్థాయిలో ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేశారు, ఎవరెవరికి సహకరించారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై నివేదిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే అధికారులందరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.