
రిమ్స్ ఆస్పత్రి
‘కిడ్నీ రోగులకు మంచి రోజులు రానున్నాయి. అతి త్వరలోనే స్థానికంగానే అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’ ఇవీ మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటీవల గుప్పించిన హామీలు. కొత్తగా వైద్యసేవలు మాట అటుంచితే ఉన్న వైద్యులు కూడా వేరే జిల్లాలకు వెళ్లిపోవడంతో కిడ్నీ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోనే ఏకైక నెఫ్రాలజిస్టు తాజాగా కర్నూలు జిల్లాలోని వైద్య కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్లిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని కిడ్నీ రోగుల కోసం రిమ్స్‌లో నెఫ్రాలజీ యూనిట్ ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు జిల్లాకు వచ్చినప్పుడల్లా హామీ ప్రకటించడం.. తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా హామీ నెరవేకపోవడంతో రిమ్స్‌లో నెఫ్రాలజీ యూనిట్ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలో ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో శిక్షణ పొందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ జ్యోత్స్న మాత్రమే ఉన్నారు. ఈమె కొన్నాళ్లుగా రిమ్స్‌లో మెడికల్ విభాగంలో పనిచేస్తున్నారు. నెఫ్రాలజీలో పీజీ డిగ్రీ ఉన్నా స్థానికంగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యులుగా చేరి కిడ్నీ రోగులకు సేవలు అందించేవారు. ఆమెకు తాజాగా కర్నూలు వైద్య కళాశాలలో నెఫ్రాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ కావాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆమె రిలీవ్ అయ్యారు. రిమ్స్‌లోనే నెఫ్రాలజీ విభాగం ఉంటే ఆమె ఇక్కడే ఉండే అవకాశముండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఉద్దానం ప్రాంతంతో పాటు పలు మండలాల్లో కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్నారు. అధికారులు పలు సర్వేలు, పరీక్షలు చేసిన తర్వాత 13,000 మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ రోగులకు క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందించే ప్రత్యేక వైద్యులు నెఫ్రాలజిస్టులు లేరు. దీంతో ఏ సమస్య వచ్చినా విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నెఫ్రాలజిస్టు లేకపోతే ఈ సమస్యలు తప్పవు..
♦ కిడ్నీ రోగులకు నిరంతర నెఫ్రాలజీ విభాగం సేవలు ఇక అందవు,
♦ రోగికి డయాలసిస్ చేసేటప్పుడు ఎ.వి.ఫిçస్ట్టల్‌ను మెడ, ఇతర భాగాల్లో వైద్యులు, టెక్నీషియన్లు అమర్చలేరు.
♦ కిడ్నీ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడు రోగికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సెంట్రల్ లైన్ ఏర్పాటు చేయాలంటే నెఫ్రాలజిస్టుకు మాత్రమే సాధ్యమవుతుంది.
♦ డయాలసిస్ జరుగుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తితే వారికి తక్షణ వైద్యం అందించే నెఫ్రాలజిస్టులు స్థానికంగా ఉండాలి. రిమ్స్‌లో ఇకపై ఆ సదుపాయం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment