కిడ్నీ రోగులకు ఉపశమనం | Establishment of dialysis centers for kidney patients: Telangana | Sakshi
Sakshi News home page

కిడ్నీ రోగులకు ఉపశమనం

Published Sun, Sep 29 2024 4:38 AM | Last Updated on Sun, Sep 29 2024 4:38 AM

Establishment of dialysis centers for kidney patients: Telangana

రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్‌ సెంటర్లు, 18 డయాలసిస్‌ సెంటర్లు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాసు్క్యలర్‌ సెంటర్లు, 18 డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న డయాలసిస్‌ కేంద్రాల్లో అదనంగా 74 డయాలసిస్‌ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు డయాలసిస్‌ తప్పనిసరి. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్‌ అవసరమవుతుంది. తొలిసారిగా డయాలసిస్‌ చేయాల్సినప్పుడు రోగికి ముందుగా శస్త్రచికిత్స చేయాలి.

డయాలసిస్‌కు యాక్సెస్‌ పాయింట్‌ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా రోగి చేతి మణికట్టు దగ్గర ఈ పాయింట్‌ గుర్తించి సర్జరీ చేస్తారు. రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వాసు్క్యలర్‌ సర్జన్‌ ఈ ఆపరేషన్‌ చేస్తారు. ఈ యాక్సెస్‌ పాయింట్‌ను ఏర్పాటు చేస్తేనే డయాలసిస్‌ ప్రక్రియ సులభతరమవుతుంది. ప్రస్తుతం వాసు్క్యలర్‌ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు కచి్చతంగా హైదరాబాద్‌ రావాల్సి ఉంటుంది. దీనివల్ల పేషెంట్లకు ఆర్థికంగా భారం కావడంతో పాటు, నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో వాసు్క్యలర్‌ యాక్సెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిమ్స్, గాం«దీ, ఉస్మానియాలతో పాటు ఖమ్మం జనరల్‌ హాస్పిటల్, వరంగల్‌ ఎంజీఎం, మహబూబ్‌నగర్‌ జనరల్‌ హాస్పిటల్, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వాసు్క్యలర్‌ సెంటర్ల కోసం రూ.32.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. డయాలసిస్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా వ్యవస్థ లేకపోవడంతో ఈ కేంద్రాలు అర్ధరాత్రి వరకూ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా 18 డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అదనంగా 74 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న సెంటర్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా రోగులకు ఉపశమనం కలగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement