
రిషితేశ్వరి మృతిపై 10న తుది నివేదిక
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
విశాఖపట్నం: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి నివేదిక సిద్ధం కానున్నట్లు రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక సిద్ధమైందని తెలిపారు. ఏయూలో సోమవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ విషయాలను వివరించారు. రిషితేశ్వరి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఘటనపై గంటన్నర పాటు చర్చించినట్లు తెలిపారు.
రిషితేశ్వరి తల్లిదండ్రుల్లో ఎంతో బాధ్యత కనిపించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు వివరించారు. కళాశాలల ప్రవేశ సమయంలో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ర్యాగింగ్‌కు పాల్పడబోననే అఫిడవిట్‌ను తీసుకోనున్నట్లు వివరించారు.