పాపవినాశనం వద్ద జీపు బోల్తా
నలుగురు భక్తులకు తీవ్రగాయాలు మరో 13 మందికి స్వల్ప గాయాలు
తిరుమల : తిరుమలలో పాపవిశానం వద్ద జీపు బోల్తా పడి నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో 13 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పెద్దపేట గ్రామం, కరీంనగర్‌కు చెందిన మొత్తం 16 మంది ఒకే జీపులో తిరుమలకు వచ్చారు. స్వామిని దర్శించుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు భక్తులంద రూ పాపవినాశనం సమీపానికి వెళ్లగానే జీపు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని లోయలోకి బోల్తా పడింది.
దీంతో వాహనంలోని వారందరూ ఆ అడవిలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. ఇతర వాహనదారుల సహకారంతో అంబులెన్స్‌లో క్షతగాత్రులు మహేం ద్ర (32), భారతి (28), అభిరాం(5), భూమేష్ (30)లను తిరుమలలోని అశ్వని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది భక్తులతోపాటు డ్రైవర్‌కు కూడా అశ్వని ఆస్పత్రిలోకి చికిత్సను అందించారు. అతివేగంతోపాటు పరిమితికి మించి భక్తులను వాహనంలో ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.